రెండు సార్లు ఏలిన పార్టీకి రెండు సీట్లే | - | Sakshi
Sakshi News home page

రెండు సార్లు ఏలిన పార్టీకి రెండు సీట్లే

Mar 23 2026 8:34 AM | Updated on Mar 24 2026 2:07 PM

-

పుదుచ్చేరి అన్నాడీఎంకేలో ఆవేదన

అభ్యర్థులుగా అన్బళగన్‌, గాంధీ

సాక్షి, చైన్నె: ఒకప్పుడు పుదుచ్చేరిలో రెండు సార్లు అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు తాజాగా గడ్డు కాలం నెలకొంది. తాజాగా రెండు సీట్లతో సర్దుకునే స్థాయి ఆ పార్టీ అక్కడ పతనం అయ్యింది. ఎట్టకేలకు ఆ రెండు సీట్లకు అభ్యర్థులను ఆదివారం ప్రకటించారు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 1974, 1977లో అన్నాడీఎంకే అధికార పగ్గాలు చేజిక్కించుకుంది. ఆ తదుపరి పరిణామాలతో ఇక్కడ కాంగ్రెస్‌ పాగా వేసింది. ఓ మారు డీఎంకే సైతం అధికారం ఏర్పాటు చేసింది. 

తాజాగా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ – బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే రెండు సార్లు అధికార పగ్గాలు చేపట్టిన అన్నాడీఎంకే పరిస్థితి పుదుచ్చేరిలో దయనీయంగా మారింది. 2021 ఎన్నికలలో డిపాజిట్లు గల్లంతైన తదుపరి ఆ పార్టీ తరపున ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు కూడా కరువైనట్టు పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో అధికారంలో ఉండటమే కాదు, ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న అన్నాడీఎంకే తాజాగా రెండు సీట్లలో పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్‌ఆర్‌కాంగ్రెస్‌, బీజేపీ కూటమిలో అన్నాడీఎంకేకు రెండు సీట్లు కేటాయించారు. ఈ స్థానాలకు అభ్యర్థులుగా చివరకు ఆ పార్టీ పుదుచ్చేరి కార్యదర్శి, మరో కీలక నేత పోటీచేయక తప్పలేదు.

అభ్యర్థులు వీరే..
పుదుచ్చేరి ఎన్నికలలో పోటీ చేసే అన్నాడీఎంకే అభ్యర్థులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రకటించారు. ఉప్పళం నియోజకవర్గం నుంచి పుదుచ్చేరి రాష్ట్ర అన్నాడీఎంకే కార్యదర్శి ఎ. అన్బళగన్‌ పోటీ చే స్తారని తెలిపారు. అలాగే ఉరుళయన్‌ పేట నియోజకవర్గం నుంచి పుదుచ్చేరి రాష్ట్ర పార్టీ మాజీ డిప్యూటీ కార్యదర్శి ఎ. గాంధీ బరిలోకి దిగుతారని వివరించారు. ఈ ఇద్దరి గెలుపునకు పార్టీ వర్గాలు కృషి చేయాలని, కూటమికి మద్దతుగా ప్రచారాలలో దూసుకెళ్లి, కూటమి అభ్యర్థుల గెలుపునకు కూడా కృషి చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement