సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర జనాభాలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. 2019–20 సర్వే వివరాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శనివారం ప్రకటించింది. 2015–16 సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 1,007 మంది మహిళలు ఉండగా, తాజా సర్వే ప్రకారం ఆ సంఖ్య 1,049కి పెరిగింది. అందులో పట్టణాల్లో మహిళలు 1,015 మంది ఉండగా, గ్రామాల్లో 1,070 మంది ఉన్నారు..
కడుపు‘కోత’లే..
రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా ఆసుపత్రులు తీరు మార్చుకోవడం లేదు. కడుపు కోయనిదే బిడ్డను బయటకు తీయడం లేదని కేంద్ర సర్వే స్పష్టం చేసింది. ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలు 57.7 శాతం ఉండగా, ఇప్పుడు 60.7 శాతానికి పెరిగాయి. అందులో పట్టణాల్లో 64.3 శాతం కాగా, గ్రామాల్లో 58.4 శాతంగా ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐదేళ్ల క్రితం సిజేరియన్ ప్రసవాలు 74.5 శాతం కాగా, ఇప్పుడు 81.5 శాతానికి పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐదేళ్ల క్రితం సిజేరియన్ ప్రసవాలు 40.3 శాతం కాగా, ఇప్పుడు 44.5 శాతానికి పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ సిజేరియన్లు పెరగటంపై విమర్శలు వస్తున్నాయి.
వేధిస్తున్న స్థూలకాయం
- రాష్ట్రంలో స్థూలకాయ సమస్య పెరుగు తోంది. 15–49 ఏళ్ల వయసులో అధిక బరు వున్న మహిళలు ఐదేళ్ల క్రితం 28.6 శాతంగా ఉంటే, ఇప్పుడు 30.1 శాతానికి పెరిగింది. అందులో పట్టణాల్లో మహిళలు 41.7% కాగా, గ్రామాల్లో 23.8 శాతంగా ఉన్నారు.
- ఇక అదే వయసున్న పురుషుల్లో స్థూల కాయులు ఐదేళ్ల క్రితం 24.2% మంది ఉండగా, ఇప్పుడు 32.3 శాతానికి పెరిగారు. పురుషులు పట్టణాల్లో 40.2 శాతం మంది స్థూలకాయులు కాగా, గ్రామాల్లో 28.1 శాతం మంది ఉన్నారని కేంద్ర సర్వే తేల్చింది.
తగ్గిన శిశు మరణాలు..
రాష్ట్రంలో శిశు మరణాల రేటు తగ్గింది. ఐదేళ్ల క్రితం ప్రతీ వెయ్యికి 20 మంది మరణించగా, ఇప్పుడు 16.8కు తగ్గింది. పట్టణాల్లో 13.8 ఉండగా, గ్రామాల్లో అది 18.8గా ఉంది. శిశు మరణాల రేటు ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో 27.7 ఉండగా, ఇప్పుడు 26.4కు తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు ఐదేళ్ల క్రితం 31.7 ఉండగా, ఇప్పుడు 29.4గా ఉంది. రాష్ట్రంలో ఐదేళ్లలోపు పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తున్నవారు 33.1 శాతం.. ఎత్తుకు తగ్గ బరువున్నవారు 21.7 శాతం.. ఐదేళ్లలోపు పిల్లల్లో తక్కువ బరువున్న వారు 31.8 శాతం కాగా, ఐదేళ్ల పిల్లల్లో అధిక బరువున్నవారు ఐదేళ్ల క్రితం 0.7 శాతంగా ఉంటే, ఇప్పుడది 3.4 శాతానికి పెరిగింది.
సర్వేలోని మరికొన్ని అంశాలు..
–ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేసినా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఐదేళ్ల క్రితం చేతి నుంచి ఒక్కో డెలివరీకి రూ.4,218 ఖర్చు చేసేవారు. ఇప్పుడది రూ. 3,846కు తగ్గింది. పట్టణాల్లో ఖర్చు రూ.3,594 ఉండగా, ఇప్పుడు రూ.3,966 చేరింది.
–ఆసుపత్రుల్లో పుడుతున్నవారి శాతం ఐదేళ్ల క్రితం 91.5 ఉండగా, ఇప్పుడది 97 శాతానికి పెరిగింది. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐదేళ్ల క్రితం 30.5 శాతం ఉండగా, ఇప్పుడు 49.7 శాతానికి పెరిగింది. ఇళ్లల్లో ప్రసవాలు ఐదేళ్ల క్రితం 2.8 శాతం ఉండగా, ఇప్పుడు 1.3 శాతానికి తగ్గాయి.
–6 నుంచి 59 నెలల్లో రక్తహీనత ఉన్న పిల్లలు ఐదేళ్ల క్రితం 60.7 శాతం ఉండగా, ఇప్పుడు 70 శాతానికి పెరిగింది.
–మొత్తం అన్ని వర్గాల మహిళల్లో రక్తహీనత ఐదేళ్ల క్రితం 56.6 శాతం ఉండగా, ఇప్పుడు 57.6 శాతానికి పెరిగింది.
–15 ఏళ్లు పైబడినవారిలో షుగర్ లెవల్ ఎక్కువ నుంచి అతి ఎక్కువగా ఉన్న మహిళలు 14.7 శాతం మంది ఉన్నారు. వారు మందులు తీసుకుంటున్నారు. పురుషుల్లో 18.1 శాతం మంది ఉన్నారు. అదే వయసులో బీపీ ఉన్న మహిళలు 26.1 శాతం మంది ఉండగా, పురుషుల్లో 31.4 శాతం మంది ఉన్నారు.
–15 నుంచి 19 ఏళ్ల మధ్య వయసులో తల్లులైనవారు, గర్భిణులుగా ఉన్నవారు 5.8 శాతం.. ఇది ఐదేళ్ల క్రితం 10.6 శాతంగా ఉండేది.
–15 నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళల్లో సేవింగ్ బ్యాంక్ ఖాతా ఉన్నవారు 84.4 శాతం. మొబైల్ ఫోన్ ఉన్నవారు 60 శాతం.
–15 ఏళ్లు పైబడిన వారిలో పొగాకు ఉపయోగించే మహిళలు 5.6 శాతం కాగా, పురుషుల్లో 22.3 శాతం ఉన్నారు. అదే వయసులో మద్యం తాగే మహిళలు 6.7 శాతం కాగా, పురుషులు 43.3 శాతంగా ఉన్నారు.
–15 నుంచి 49 ఏళ్ల మహిళల అక్షరాస్యత 66.6 శాతం. అందులో పట్టణాల్లో అక్షరాస్యత 81 శాతం, గ్రామాల్లో 58.1 శాతం.. ఇక పురుషుల అక్షరాస్యత శాతం 84.8 శాతం.
–ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న మహిళల శాతం 26.5 శాతం.. కాగా అందులో పట్టణాల్లో 43.9 శాతం, గ్రామాల్లో 15.8 శాతం మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment