
హిమాయత్‌నగర్: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100కు పైగా క్రెడిట్ కార్డుల నుంచి దాదాపు రూ.5కోట్ల సొమ్మును స్వైప్ చేసి..ఆ మొత్తం సొమ్ముతో పరారైన దమ్మాయిగూడకు చెందిన నవీన్ అనే యువకుడి భాగోతం కలకలం రేపుతోంది. స్వైప్ చేసి డబ్బులు ఇస్తాడని ఎదురుచూసీ చూసీ చివరికి మోసపోయామని భావించి దాదాపు 20మంది యువకులు పోలీసులను ఆశ్రయించారు. రెండు రోజులుగా సిటీ సైబర్‌క్రైం, సీసీఎస్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వివరాలిలా.,
మొబైల్ షోరూం స్వైప్ మిషన్ ద్వారా
ఓ మొబైల్ షోరూంలో క్యాషియర్‌గా పనిచేస్తున్న నవీన్ మొదట్లో తన స్నేహితులకు క్రెడిట్‌కార్డును స్వైప్ చేసి కమీషన్ తీసుకోకుండా క్యాష్ ఇచ్చేవాడు. ఇలా అతనిపై నమ్మకం కుదరడంతో మిత్రబృందానికి అత్యాశకలిగింది. నవీన్ తమ నుంచి కమీషన్ తీసుకోవడం లేదు కాబట్టి మనమే క్రెడిట్‌కార్డులను సేకరించి పదిశాతం కమీషన్ చొప్పున క్యాష్ కావాల్సిన వారికి ఇద్దామనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు.
ఇలా సుమారు 20మంది యువకులు ఒక్కొక్కరు ఐదారు బ్యాంకుల నుంచి దాదాపు వంద క్రెడిట్‌కార్డులు సేకరించి పిన్ నంబర్లతో సహా ఒకేసారి నవీన్‌కు ఇచ్చారు. ఇన్ని కార్డులు ఒకేసారి ఇవ్వడంతో క్యాష్ ఇచ్చేందుకు అతను వారం గడువు అడిగాడు. అయితే వారం కాదు.. రెండు వారాలు గడిచినా పత్తా లేకపోవడం... ఈలోగా తమ కార్డుల నుంచి స్వైప్ చేస్తున్నట్టు ఫోన్లలో మెసేజ్‌లు రావడంతో యువకులు పోలీసులను ఆశ్రయించారు. కాగా, తాను ఒక్కడినే రూ.కోటి డబ్బు కావాలని కార్డులు ఇచ్చినట్లు ఓ బాధితుడు రవి చెప్పుకొచ్చారంటే ఏ స్థాయిలో మోసం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment