70% గృహహింస కేసులు ఈ కుటుంబాల్లోనే..
వివాహం జరిగిన ఐదేళ్లలోపే 42 శాతం జంటల్లో మనస్పర్థలు
సీడీఈబ్ల్యూ కౌన్సెలింగ్ సెంటర్ల ద్వారా గృహహింస కేసుల పరిష్కారానికి కౌన్సెలింగ్ ఇస్తున్నాం : మహిళా భద్రత విభాగం డీజీ శిఖాగోయల్
సాక్షి, హైదరాబాద్: ‘వివాహ బంధంలో జంటల మధ్య కలహాలు ఎక్కువగా చిన్న కుటుంబాల్లోనే (న్యూక్లియర్ ఫ్యామిలీ)ఉంటున్నాయి. కుటుంబ కలహాలకు సంబంధించిన కేసుల్లో 70 శాతం చిన్న కుటుంబాల నుంచి వచ్చి నవే’అని మహిళా భద్రత విభాగం డీజీ శిఖాగోయల్ తెలిపారు. 42 శాతం సమస్యలు వివాహమైన మొదటి 0–5 సంవత్సరాల్లో సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.
గృహహింస కేసుల పరిష్కారం, సయోధ్య పెంచడంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్ (సీడీఈడబ్ల్యూ) గణనీయమైన పురోగతిని సాధిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని 27 సీడీఈడబ్ల్యూ సెంటర్లలో మొత్తం 9 వేల కేసులు వచ్చాయన్నారు. కౌన్సెలింగ్ సెషన్‌ల ద్వారా 8,200 కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. సీడీఈడబ్ల్యూకు వచ్చిన కేసుల్లో సేకరించిన వివరాలను విశ్లేషించగా..గుర్తించిన కీలక అంశాలు ఇలా ఉన్నాయి
⇒ గృహహింస కేసులకు ప్రధాన కారణాలు మద్యపాన వ్యసనం (63.2 %), ఆర్థిక ఒత్తిడి (50%), అనుమానం (48 %), వివాహేతర సంబంధాలు (33% ).
⇒ పదేపదే గృహహింసకు గురవుతున్న మహిళలు 22 % మంది ఉంటున్నారు.
⇒ గృహహింస కేసులు నమోదవుతున్న కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉంటున్నాయి. కేసులు నమోదైన 50% కుటుంబాలు నెలకు రూ.11,000 నుంచి రూ. 30,000 మధ్య సంపాదన కలిగినవే.
Comments
Please login to add a commentAdd a comment