2003లో రామ మందిరానికి తాళం వేసిన మావోయిస్టులు
సీఆర్పీఎఫ్ చొరవతో దండకారణ్యంలో తెరుచుకున్న గుడి తలుపులు
శ్రీరామ నవమి పూజలకు గ్రామస్తుల ఏర్పాట్లు
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని సుక్మా జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మూతబడిన ఒక రామాలయం తలుపులు సీఆర్పిఎఫ్ అధికారుల చొరవతో 21 ఏళ్ల అనంతరం తెరుచుకున్నాయి. సుక్మా జిల్లాలోని చింతల్‌నార్ పోలీస్‌స్టేషన్ పరిధి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కేరళపొంద గ్రామంలో పురాతన రామమందిరం ఉంది. ఆ గుడిలో గ్రామస్తులు ప్రతిరోజూ పూజలు నిర్వహించేవారు. దీనిపై ఆగ్రహించిన మావోయిస్టులు 2003 సంవత్సరంలో గుడి మూసేసి తాళాలు వేశారు. అప్పటి నుంచి ఆలయం నిరాదరణకు గురైంది. మావోయిస్టుల భయంతో స్థానికులు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఎదురైంది.
అయితే, కేరళపొంద గ్రామంలో నెల రోజుల క్రితం సీఆర్‌పీఎఫ్ క్యాంపు నిర్మించారు. ఈ క్రమంలో అధికారులు తరచుగా గ్రామస్తులతో సమావేశమై సమస్యలు తెలుసుకుంటుండగా.. 21 ఏళ్లుగా తెరుచుకోని రామాలయ అంశం బయటపడింది. అయితే, తమకు తాముగా గుడి తెరిస్తే మావోయిస్టులు ఇబ్బంది పెడతారని గ్రామస్తులు చెప్పడంతో సీఆర్‌పీఎఫ్ అధికారులు చొరవ తీసుకుని మంగళవారం ఆలయాన్ని తెరిచారు. 74వ బెటాలియన్‌కు చెందిన అధికారులు, జవాన్లతో పాటు గ్రామస్తులు ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలను శుభ్రం చేశారు.
ఈ రామమందిరంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలు సుందరంగా ఉన్నాయని, గుడి శిఖరంపై ఆంజనేయస్వామి విగ్రహం ఉందని పోలీసులు తెలిపారు. గుడి తలుపులు తెరుచుకోవడంతో గ్రామస్తులు సంతోషంతో నృత్యం చేశారు. ఇక నుంచి ప్రతిరోజూ పూజలు చేస్తామని, ఈ ఏడాది శ్రీరామనవమి కూడా ఘనంగా నిర్వహిస్తామని గ్రామస్తులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment