గృహ నిర్మాణ, పురపాలక శాఖల ద్వారా ప్లాట్లు, ఫ్లాట్ల బహిరంగ వేలం ప్రారంభించండి
రీసోర్స్ మొబిలైజేషన్ సబ్‌కమిటీ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు
జాయింట్ వెంచర్ల న్యాయ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: సామాన్య ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుల సమీకరణకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ సోమవారం సచివాలయంలో భేటీ కాగా, సబ్‌కమిటీ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులతోపాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణశాఖ ఆ«ధ్వర్యంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో చేపట్టిన జాయింట్ వెంచర్లపై చర్చ జరిగింది.
ఈ వెంచర్ల కోసం జరిగిన ఒప్పందాలను అమలు చేయకుండా కొందరు వ్యక్తులు కోర్టులకు వెళ్లి న్యాయ వివాదాలు సృష్టిస్తున్నారని అధికారులు సబ్‌కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ వివాదాల పరిష్కారానికి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు చైర్మన్‌గా పురపాలక, గృహ నిర్మాణ, న్యాయ శాఖ కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ సమావేశమై వారం రోజుల్లోగా సమస్యలను పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించాలని సబ్‌కమిటీ సూచించింది.
⇒ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియను కొనసాగించాలని, ముందుగా కొంత భాగంలోని భూములను వేలం వేసి రాష్ట్ర ప్రభుత్వానికి గరిష్ట ఆదాయం సమకూరేలా ముందుకెళ్లాలని సూచించింది.
⇒ రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పెండింగ్‌లో ఉన్న ఫ్లాట్ల అమ్మకాల స్థితిగతులను సమీక్షించిన సబ్‌కమిటీ ఈ ఫ్లాట్ల అమ్మకాల ప్రక్రియకు ప్రణాళిక రూపొందించాలని కోరింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను మినిట్స్ రూపంలో నమోదు చేయాలని, మరో వారంలో జరిగే సమావేశానికి యాక్షన్ టేకెన్ రిపోర్టుతో హాజరుకావాలని అధికారులను భట్టి ఆదేశించారు.
⇒ ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండడంపై సబ్‌కమిటీ అధికారులను ప్రశ్నించింది. అయితే, న్యాయ పరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా చేపడుతున్నందునే కొంత ఆలస్యం జరుగుతోందని అధికారులు సబ్‌కమిటీకి వివరించారు.
జీరో కాలుష్యం ఉండాలి
కాలుష్య సమస్య కారణంగా తాము ఓఆర్‌ఆర్ బయటకు వెళ్లేందుకు కూడా ముందుకొస్తున్నట్టు పరిశ్రమల నిర్వాహకులు సబ్ కమిటీకి స్పష్టం చేసిన నేపథ్యంలో వారి విజ్ఞప్తులను పరిశీలించి ఓఆర్‌ఆర్ బయట పరిశ్రమలను ప్రోత్సహించాలని, హైదరాబాద్‌నగరంలో జీరో కాలుష్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల అధికారులను సబ్‌కమిటీ ఆదేశించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో 5 ఎకరాల విస్తీర్ణంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా ఇండస్ట్రియల్ పార్కులు నిర్మించాలని, తద్వారా గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి, ఆర్థిక చేయూత లభిస్తుందని సబ్‌కమిటీ సూచించింది.
ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పురపాలక, రెవెన్యూ, ఐటీ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు దానకిశోర్, నవీన్ మిత్తల్, జయేశ్‌రంజన్, సందీప్‌కుమార్ సుల్తానియా, హౌసింగ్ శాఖ కార్యదర్శి బుద్ధప్రకాశ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధ్దన్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సి.నారాయణరెడ్డి, క్రాంతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment