జీవో 317పై సీఎంకు తుది నివేదిక ఇచ్చిన మంత్రివర్గ ఉపసంఘం
స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపుపై కీలక సూచనలు
స్పౌజ్, మ్యూచువల్, అనారోగ్య సమస్యల కేటగిరీ దరఖాస్తులకు త్వరలో మోక్షం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన జోనల్ విధానం మేరకు ఉద్యోగుల కేటాయింపులపై వచి్చన వినతుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన పూర్తయింది. వినతులపై పలుమార్లు సమీక్షలు నిర్వహించడంతో పాటు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి సూచనలు పరిగణనలోకి తీసుకుని రూపొందించిన నివేదికను ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి సమరి్పంచింది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వం ఉద్యోగుల కేటాయింపులు జరిపేందుకు జీవో 317ను తీసుకొచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు ఉద్యోగుల కేటాయింపులు జరిపాయి. జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్లలోని ఉద్యోగులను జీవో 317 ప్రకారం కేటాయించారు.
అయితే స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా కేటాయింపులు జరపడంతో తీవ్రంగా నష్టపోయామనే భావనతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు న్యాయపోరాటానికి దిగారు. దీంతో గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో జీవో 317 బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. తర్వాత అధికారంలోకి రావడంతో దీనిపై ప్రత్యేకంగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ ప్రభుత్వ శాఖలతో పలుమార్లు సమావేశమైంది. అదేవిధంగా ప్రత్యేక వెబ్‌పోర్టల్ ద్వారా ఉద్యోగుల నుంచి వినతులు స్వీకరించింది. వాటిని ఆయా శాఖలకు పంపడంతో పాటు, సమస్యాత్మకంగా లేని వాటిని పరిష్కరించడానికి చర్యలు చేపట్టింది. ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సినవి, కొన్ని ఇతర స్థాయిలోనివి మినహా మిగిలిన దరఖాస్తులను ఇప్పటికే పరిష్కరించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలతో నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు వివిధ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలతో రూపొందించిన నివేదికను దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు.. ముఖ్యమంత్రికి సమర్పించారు.
ఆ మూడు కేటగిరీలకు ఉపశమనం!
ముడు కేటగిరీల్లోని ఉద్యోగులకు సత్వర ఉపశమనం కల్పించాలని కమిటీ ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. స్పౌజ్, పరస్పరం (మ్యూచువల్), అనారోగ్య సమస్యల కేటగిరీలకు సంబంధించినవి దాదాపు 4 వేల వరకు దరఖాస్తులు ఉండగా.. వాటన్నింటినీ పరిష్కరించాలని సూచించినట్లు తెలిసింది. ఈ క్రమంలో వారం, పదిరోజుల్లో ఈ మూడు కేటగిరీల వారికి ఉపశమనం లభించనుంది. ఇక స్థానికత విషయంలో పలు అభ్యంతరాలు వచ్చాయి. అయితే కొత్త జిల్లాల నేపథ్యంలో జరిగిన మార్పులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, వారి స్థానికతను కూడా నిర్ధారించాలని సూచించినట్లు తెలిసింది. మిగిలిన కేటగిరీలకు సంబంధించి పలు సూచనలు కూడా చేసినట్లు సమాచారం. వెబ్‌పోర్టల్‌కు వచ్చిన దరఖాస్తులన్నీ సంబంధిత ప్రభుత్వ శాఖలకు అందగా.. వాటిని ఆయా శాఖల ఉన్నతాధికారులు ఇప్పటికే పరిశీలించి కేటగిరీల వారీగా విభజించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. కాగా ఈ నెల 26న జరిగే కేబినెట్ భేటీలో ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment