సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తరహాలో విద్యుత్ బిల్లులూ ఇకపై ప్రతిసారీ పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంచలనాత్మక ఆదేశాల నేపథ్యంలో వినియోగదారులపై మళ్లీ ఇంధన సర్దుబాటు చార్జీల (ఫ్యూయెల్ సర్‌చార్జీ అడ్జెస్ట్‌మెంట్/ఎఫ్‌ఎస్‌ఏ) మోత మోగనుంది. విద్యుదుత్పత్తికి వినియోగించే బొగ్గు, గ్యాస్ ధరల్లో పెరుగుదల భారాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారులపై మోపి ప్రతి నెలా ఎఫ్‌ఎస్‌ఏ రూపంలో వసూలు చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ బుధవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. తక్షణమే ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండళ్లను (ఈఆర్సీలు) ఆదేశించింది. విద్యుత్ సంస్థలపై పెరుగుతున్న వ్యయ భారాలను ఎప్పటికప్పుడు వినియోగదారులపై బదలాయించి వసూలు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గత నెల 22న విద్యుత్ నిబంధనలు–2021ను ప్రకటించింది. పెరిగే వ్యయ భారాలను మదించడానికి ఇందులో ఓ ఫార్ములాను సైతం పొందుపర్చింది. రాష్ట్రాల ఈఆర్సీలు సొంత ఫార్ములాను రూపకల్పన చేసుకునే వరకు..తమ ఫార్ములాను అనుసరించాలని ఆదేశించింది.
నాణ్యత దెబ్బ తింటోందంటూ..
బొగ్గు ధరల్లో పెరుగుదల వల్ల అయ్యే వ్యయం సకాలంలో తిరిగి వసూలు కాక విద్యుదుత్పత్తి కంపెనీలు సంక్షోభంలో నెట్టబడుతున్నాయి. బొగ్గు కొనుగోళ్లకు అవసరమైన డబ్బులు లేక విద్యుదుత్పత్తిని సైతం కొనసాగించలేకపోతున్నాయి. వీటి నుంచి విద్యుత్ కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేసే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సైతం సకాలంలో వినియోగదారుల నుంచి ధరల పెరుగుదల భారాన్ని వసూలు చేసుకోలేకపోతున్నాయి. దీంతో విద్యుత్ సరఫరా సేవల నాణ్యత దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలోనే.. పెరిగే బొగ్గు, గ్యాస్ ధరల వ్యయ భారాన్ని విద్యుదుత్పత్తి కంపెనీలు సకాలంలో డిస్కంల నుంచి, డిస్కంలు వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చినట్టు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. బొగ్గు ధరల్లో భారీ పెరుగుదలకు, కొరత తోడు కావడంతో ఇటీవల దేశ విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం పేర్కొంది.
తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో..
ప్రస్తుతం ఏడాదికోసారి మాత్రమే విద్యుత్ చార్జీలను సవరించే/పెంచే పద్ధతిని అమలు చేస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికోసారి కూడా విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతించడం లేదు. గత ఆరేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచలేదు. కానీ ఇంధన సర్దుబాటు చార్జీల ఫార్ములా ఆధారంగా టారిఫ్‌ను ఏడాదిలో ఒకసారికి మించి సవరించుకోవడానికి విద్యుత్ చట్టంలోని సెక్షన్ 62(4) అనుమతిస్తోంది. దీని ఆధారంగానే ఇంధన సర్దుబాటు చార్జీల వసూళ్లపై నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. దీంతో ఇకపై ప్రతి నెలా విద్యుత్ బిల్లులు పెరిగేందుకు అవకాశం ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంధన సర్దుబాటు చార్జీలను కొంత కాలం పాటు వసూలు చేయగా, వినియోగదారులు గగ్గోలు పెట్టారు. తర్వాత రాష్ట్ర హైకోర్టు ఈ వసూళ్లు అక్రమమని తేల్చి బ్రేక్ వేసింది. దాదాపు దశాబ్దం గ్యాప్ తర్వాత కేంద్రం ఈ ఎఫ్‌ఎస్‌ఏను తెరపైకి తెచ్చింది.
రాష్ట్రాలు సబ్సిడీ ఇచ్చుకోవచ్చు..
ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రతి నెలా వసూలు చేసుకోవాలని ఆదేశించిన కేంద్ర విద్యుత్ శాఖ..విద్యుత్ చట్టంలోని సెక్షన్ 65 ప్రకారం ముందస్తుగా సబ్సిడీ చెల్లించి వినియోగదారులపై వాటి భారం పడకుండా చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని పేర్కొంది. సర్దుబాటు చార్జీలపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తరహాలో...విద్యుత్ బిల్లుల బాదుడు..!
Published Fri, Nov 12 2021 4:02 AM | Last Updated on Fri, Nov 12 2021 4:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment