పదో తరగతి విద్యార్థినికి గుండెపోటు
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
వైద్యుల తీరుపై కార్మిక సంఘాల ఆగ్రహం
జ్యోతినగర్(రాముండం): ‘అమ్మా సాహితీ.. మమ్మల్ని విడిచి వెళ్లిపోయావా తల్లీ.. నీవు చక్కగా చదువుకుని భవిష్యత్‌లో ఎంతో ఎదగాలని ఆశించాం.. కానీ మమ్మల్ని ఇలా విడిచి వెళ్తావని అనుకోలేదమ్మా’ అని ఆ తల్లి లక్ష్మి రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. ఎన్టీపీసీ ఆపరేషన్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్న మల్లెపల్లి రాజలింగు–లక్ష్మి దంపతులకు సాత్విక, సాహితి కుమార్తెలు ఉన్నారు. పర్మినెంట్ టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్నారు.
పెద్దకుమార్తె సాత్విక డిగ్రీ చదువుతోంది. చిన్నకుమార్తె సాహితి(15) ఎన్టీపీసీ పీటీఎస్‌లోని సెయింట్ క్లేర్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి సాహితి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వెంటనే టౌన్‌షిప్‌లోని ధన్వంతరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఆస్పత్రికి రెఫర్ చేశారు. అయితే, అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాహితి సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆమె మృతికి సంతాప సూచకంగా హైస్కూల్‌కు సెలవు ప్రకటించారు.
వైద్యులపై గుర్తింపు సంఘం గరం?
సాహితి గుండెపోటుతో మృతి చెందడంతో వైద్య బృందంపై ఉద్యోగ గుర్తింపు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థినిని ఆస్పత్రిలో చేర్పిస్తే సరైన వైద్యం అందించ లేదని ఆరోపించారు. ప్రథమ చికిత్స సైతం తూతూమంత్రంగా చేసి కరీంనగర్‌కు రెఫర్ చేశారని ధ్వజమెత్తారు.
ప్రమాదకర పరిస్థితిలో ఉన్న విద్యార్థినికి చికిత్స అందించడంతో ఆస్పత్రి వర్గాలు విఫలమయ్యాయని విమర్శించారు. జాతీయ రంగ సంస్థ ఎన్టీపీసీ ఆస్పత్రిలో సరైన సమయంలో సరైన వైద్యం అందకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గుండెపోటు వచ్చిన విద్యార్థినిని కరీంనగర్‌కు రెఫర్ చేయడంతో ఆమెకు సరైన సమయంలో చికిత్స అందకపోవడంతోనే మృతి చెందిందని ఆరోపించారు. వైద్యుల తీరుపై యాజమాన్యం విచారణ చేపట్టాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment