
మంత్రి దామోదర రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: వైద్య రంగంలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు, డీన్‌లు, ప్రిన్సిపాళ్లతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వైద్య విద్యలో తెలంగాణకు అత్యుత్తమ కేంద్రంగా గుర్తింపు తేవడానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్య కళాశాలలతోపాటు డెంటల్ కాలేజీలలో మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు వైద్య, డెంటల్ కళాశాలల యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రైవేట్ కళాశాలల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల దగ్గర అదనపు ఫీజులు వసూలు చేయరాదని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 28 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండగా, వాటిల్లో 3,690 ఎంబీబీఎస్ సీట్లున్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వ అ«దీనంలోని ఎయిమ్స్‌లో 100, ఈఎస్‌ఐలో 125 ఎంబీబీఎస్ సీట్లున్నాయన్నారు. ఇక ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 1,320 పీజీ సీట్లున్నట్లు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ పీజీ మెడికల్ సీట్లు 179 ఉన్నాయన్నారు. ప్రైవేట్ రంగంలోని 28 మెడికల్ కళాశాలల్లో 4,600 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయన్నారు. సమావేశంలో వైద్య విద్య సంచాలకురాలు (డీఎంఈ) డాక్టర్ వాణి, వైద్య విద్య స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ విమల థామస్ పాల్గొన్నారు.
నేడు 96 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రలు
జూన్ 20న నులిపురుగుల నివారణ దినం సందర్భంగా 96 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రలు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ రోజు వేయించుకోని వారికి 27న మాప్ అప్ రౌండ్‌లో వేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment