సాక్షి, ములుగు: మేడారంలో సమ్మక్క, సారలమ్మలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగ.. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.నిన్న మేడారంలో కీలక ఘట్టం ప్రారంభమైంది. సమ్మక్క తల్లి గద్దెపై కొలువు దీరింది. సమ్మక్కను ప్రధాని పూజారి ప్రతిష్టించారు. వనదేవతల్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
సమ్మక్క, సారలమ్మలను గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి అర్జున్ ముండా, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ, గవర్నర్‌గా మూడోసారి వచ్చానని, తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. సమ్మక్క సారలమ్మల పరాక్రమ పోరాటం గొప్పది. ఆరు గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్నానని గవర్నర్ తెలిపారు.
కేంద్ర మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ, మేడారం జాతర గొప్ప జాతర అని, అమ్మ వార్లను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా గిరిజనులందరికి శుభాకాంక్షలు తెలిపారు.
చిలకలగుట్టనుంచి సమ్మక్క తల్లి మేడారం గద్దెపైకి చేరడంతో మహాజాతర పరిపూర్ణత సంతరించుకుంది. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరడంతో భక్తుల మొక్కులు జోరందుకున్నాయి. గురువారం రాత్రి చిలకలగుట్టనుంచి పూజారులు, వడ్డెలు సమ్మక్కను భక్తుల జయజయధ్వానాల నడుమ తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్ఠించారు. దారిపొడవునా డోలు వాయిద్యాలు, ఆదివాసీల నృత్యాలు ఆకట్టుకున్నాయి. పూనకాలతో శివసత్తులు ఊగిపోయారు. జై సమ్మక్క.. జైజైసమ్మక్క.. తల్లీ శరణు.. జయహో జగజ్జనని.. సల్లంగాచూడు తల్లి అంటూ భక్తుల నామస్మరణ మార్మోగింది.
గద్దెల వద్ద ప్రత్యేక పూజలు..
తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క ఆగమనం. తల్లిరాకతోనే జాతర సంపూర్ణమవుతుంది. కాగా, గురువారం మేడారంలోని సమ్మక్క గుడి శక్తిపీఠం వద్ద పూజారులు, వడ్డెలు సంప్రదాయ దుస్తులు ధరించి కుంకుమ, పసుపు, ఇతర పూజాసామగ్రిని పట్టుకొని గద్దెల వద్దకు చేరి ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజుకు పసుపు కుంకుమ అప్పగించిన తర్వాత పూజారులు చిలకలగుట్టకు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment