సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్‌ను కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసింది. ఈ మేరకు ఆయన పేరును ఏఐసీసీ అధికారికంగా వెల్లడించింది. బీసీ వర్గానికి చెందిన నేతకే పీసీసీ పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక, ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్సీగా ఉన్నారు. 2023లో పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా పని చేశారు.
Congress appoints B Mahesh Kumar Goud as President of Telangana Pradesh Congress Committee with immediate effect pic.twitter.com/DoSd31xagO
— ANI (@ANI) September 6, 2024
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘నాపై అత్యంత నమ్మకంతో నాకు కీలకమైన టీపీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు. పార్టీ అప్పగించిన ఈ గొప్ప బాధ్యతలను చిత్తశుద్ధితో అంకిత భావంతో పని చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తాను. నిరంతరం కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పని చేసి రాష్ట్రాభివృద్ధికి, పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తాను. ఇంతకాలం నాకు అన్ని రకాలుగా సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. నాకు పదవి రావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేశారు.
కాగా, తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించేందుకు కాంగ్రెస్ పార్టీ నెలల సమయం తీసుకుంది. ఆగస్టు 23న పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై సుదీర్ఘంగా చర్చించిన హై కమాండ్ పెద్దలు. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలలో మహేష్ కుమార్ గౌడ్‌కు పట్టుంది. దక్షిణ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడంతో ప్రాంతీయ సమీకరణాల దృష్ట్యా ఉత్తర తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్‌ను హైకమాండ్ ఎంపిక చేసింది.
ఓసీ సామాజిక వర్గం నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, బీసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్‌ను ఎంపిక చేశారు. కుల సమీకరణలను దృష్టిలో ఉంచుకొని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. కాంగ్రెస్ హై కమాండ్ పెద్దలతో మహేష్ కుమార్ గౌడ్ క్రియాశీల సంబంధాలు కలిగి ఉన్నారు. అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆ పదవి ఖాళీ అయ్యింది. ఆ స్థానంలో మమేష్ కుమార్ గౌడ్‌ను ఎంపిక చేశారు. ఇక, రేవంత్‌కు అత్యంత సన్నిహితుడైన మహేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ పీఠం వరించడం విశేషం.
రాజకీయ ప్రస్థానం ఇలా..
👉నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలంలోని రహత్ నగర్‌లో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మించారు. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమి చెందారు.
👉2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశాడు.
👉2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.
👉అనంతరం, పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.
👉2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు. కానీ, అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.
👉మహేష్ కుమార్ 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా నియామకం.
👉2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపికయ్యారు.
👉2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ-పీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితుడయ్యాడు.[
👉2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలుపొందారు. రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది.
👉జనవరి 31న తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment