తెలంగాణ కొత్త గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
రాధాకృష్ణన్‌తో ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే
పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, అధికారులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజా సంఘాలు, సామాన్య ప్రజలకు రాజ్‌భవన్ అత్యంత నిబద్ధతతో నిర్విరామ సహకారం అందిస్తుందని రాష్ట్ర నూతన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చెప్పారు. తాను అందరి వాణిని వింటానని, ప్రతి ఆందోళనను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య ప్రక్రియను ఎల్లవేళలా సమర్థిస్తూ, గౌరవించేలా, అత్యంత శ్రద్ధతో తన విధులను నిర్వర్తిస్తానని ప్రతిజ్ఞ చేశారు.
న్యాయం, సమగ్రత, నిష్పాక్షికత సూత్రాలకు కట్టుబడి దృఢ నిబద్ధతతో పనిచేస్తానన్నారు. రాష్ట్రం, ప్రజల అభ్యున్నతికి అత్యంత అంకితభావం, చిత్తశుద్ధితో పని చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర మూడో గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ గవర్నర్లు సీహెచ్ విద్యాసాగర్‌రావు, రామ్మోహన్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ ప్రసంగించడంతో పాటు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఓ సందేశాన్ని విడుదల చేశారు.
ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యత ఇవ్వండి
ప్రజల అవసరాలు, ఆకాంక్షలను పరిష్కరించడానికి ప్రాధాన్యతనివ్వాలని అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజా సంఘాలకు రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, న్యాయం, కరుణ అనే సూత్రాల ఆధారంగా మార్పు కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ గొప్ప చరిత్ర, సంస్కృతి, పటిష్ట ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రమని, వ్యవసాయం, ఐటీ, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో విశేష ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. లక్షలాది మందికి లబ్ధి చేకూర్చే వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయడంలోనూ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు.
తెలంగాణ గవర్నర్‌గా పని చేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా కొత్త గవర్నర్‌కు ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎస్ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రివర్గంతో గవర్నర్ గ్రూపు ఫోటో దిగారు. ఇంతకుముందు రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్‌కు అదనంగా తెలంగాణ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు
చార్మినార్: గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానంతరం బుధవారం సాయంత్రం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీమణితో కలిసి వచ్చిన ఆయనకు ఆలయ ట్రస్టీ శశికళ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.
యాదాద్రి మరో వెయ్యేళ్లు నిలుస్తుంది
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అద్భుతంగా ఉందని గవర్నర్ అన్నారు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని, మరో వెయ్యేళ్లు అద్భుతంగా నిలుస్తుందని చెప్పారు. గర్భాలయంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఒళ్లు పులకరించిందని అన్నారు. అంతకుముందు గవర్నర్‌కు సీఎస్ శాంతికుమారి, కలెక్టర్ హనుమంత్ కె.జండగే, ఇతర అధికారులు, అర్చకులు తూర్పు త్రితల రాజగోపురం ముందు సంప్రదాయంగా స్వాగతం పలికారు.
అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులను గవర్నర్ దర్శించుకున్నారు. ముఖ మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. సీఎస్ శ్రీస్వామి వారి చిత్రపటాన్ని అందజేయగా, ఈవో భాస్కర్‌రావు లడ్డూ ప్రసాదం ఇచ్చారు. శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీపుష్ప యాగం వేడుకలో గవర్నర్ పాల్గొన్నారు. ఆలయ ధ్వజ స్తంభం వద్ద మొక్కి, సందర్శకుల పుస్తకంలో తన అనుభూతిని రాసి సంతకం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment