నేరాల్లో మరో కోణం! | crimes in Hyderabad 2024: telamgana | Sakshi
Sakshi News home page

నేరాల్లో మరో కోణం!

Published Sun, Dec 29 2024 6:27 AM | Last Updated on Sun, Dec 29 2024 6:27 AM

crimes in Hyderabad 2024: telamgana

ఈ ఏడాది హైదరాబాద్‌లో ఘరానా నేరాలకు తోడు విచిత్ర ఉదంతాలు 

పోలీసులకు తలనొప్పులు తెస్తున్న ఈ తరహా కేసులు

సాక్షి, హైదరాబాద్‌: చిల్లర దొంగతనాలు మొదలు రూ.కోట్లు కాజేసిన సైబర్‌ కేటుగాళ్ల ఉదంతాల వరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ ఏడాది కాలంలో వివిధ నేరాలు చోటుచేసుకున్నాయి. అందుకు సంబంధించి బోలెడు ఎఫ్‌ఐఆర్‌లు సైతం నమోదయ్యాయి. కానీ వాటిలో కొన్ని విచిత్రమైన కేసులు పోలీసులను ఆశ్చర్యపరిచాయి. ఇంతకీ ఆ విచిత్ర కేసులేమిటంటే...

మద్యంపై మక్కువతో.. 
పనిచేస్తున్న సంస్థలకు సున్నం పెట్టే వాళ్లు.. అన్నం పెట్టిన ఇంట్లోనే కన్నం వేసిన వాళ్ల గురించి అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. సాధారణంగా ఆయా నేరాల్లో సొమ్ము కాజేయడమే నిందితుల ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.10లోని ఆర్‌యూ పబ్‌లో పనిచేసే వినీత్‌కుమార్‌ అనే సెక్యూరిటీ గార్డు వెరైటీ చోరీకి పాల్పడ్డాడు. ఖరీదైన విదేశీ మద్యం తాగడం కోసం ఇద్దరు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి దాటాక పబ్‌లోకి ప్రవేశించి రాయల్‌ సెల్యూట్, చివాస్‌ రీగల్, మొహిట్‌ చాన్‌ దాన్‌ బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. పనిలో పనిగా పారిపోవడానికి ఉపయోగపడుతుందని రూ. 2 లక్షల నగదు కూడా కొట్టేశాడు.

మాస్టార్‌కు ఎదురైన ప్రేమ వేధింపులు
బస్టాప్‌ల లాంటి ప్రదేశాల్లో రోడ్‌సైడ్‌ రోమియోల ఆగడాల గురించి.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే కీచకులుగా మారిన ఉదంతాల గురించి అప్పుడప్పుడూ వింటుంటాం. కానీ హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఓ గురువుపై మనసు పారేసుకున్న ఓ యువతి తన ప్రేమను నిరాకరించాడన్న కోపంతో ఆయనపై క్షక్షగట్టింది. లెక్చరర్‌తోపాటు ఆయన కుమార్తె ఫొటోలను అసభ్యంగా మారి్ఫంగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసింది. దీనిపై బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో ఆ యువతి చివరకు జైలుపాలైంది.

హుస్సేన్‌సాగర్‌లో  ‘90 ఎంఎల్‌’స్టోరీ
నగరం నడిరోడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ కాలుష్యానికే కాదు.. ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారడం తెలిసిందే. సాధారణంగా ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల కారణంగా అవి జరుగుతుంటాయి. కానీ ఓ మందుబాబు మాత్రం మద్యం మత్తులో హుస్సేన్‌సాగర్‌లోకి దిగి ‘చుక్క’కావాలంటూ పోలీసులకు చుక్కలు చూపించాడు. నగరానికి చెందిన ఓ యువకుడు నిషాలో హుస్సేన్‌సాగర్‌లోకి దిగాడు.

నడుము లోతు నీళ్లున్న ప్రాంతంలో అతడు నిల్చుని ఉండటాన్ని చూసిన పర్యాటకులు ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాడనుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్‌ వద్దకు చేరుకున్న ఓ కానిస్టేబుల్‌ నీటిలోకి తాడు విసిరి, దాన్ని పట్టుకుని పైకి రావాల్సిందిగా యువకుడిని కోరాడు. కానీ అందుకు నిరాకరించిన మందుబాబు.. తనకు ‘90 ఎంఎల్‌’ఇస్తేనే బయటకు వస్తానంటూ మొండికేశాడు. చివరకు గంటన్నరపాటు సాగిన డ్రామా అనంతరం పోలీసులు అతన్ని బయటకు రప్పించారు.  
భర్తపైనే  అట్రాసిటీ కేసు
ఎస్సీ, ఎస్టీ అత్యాచార (నిరోధక) చట్టం ప్రకారం ఆయా వర్గాలకు చెందిన వ్యక్తుల్ని కులం పేరుతో దూషించడం తీవ్రమైన నేరం. సామాన్యులే కాదు.. కొన్ని సందర్భాల్లో ప్రముఖులు, పోలీసులు సైతం ఈ తరహా కేసుల్లో ఇరుక్కున్నారు. అయితే శ్రీనగర్‌ కాలనీకి చెందిన ఓ బ్యూటీషియన్‌ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న భర్తపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం సంచలనం సృష్టించింది. కుమార్తె పుట్టాక భర్త వేధింపులు, భౌతికదాడులను మౌనంగా భరిస్తున్న ఆమెపై 2018 నుంచి కులం పేరుతో దూషించడం కూడా మొదలుపెట్టాడు. దీంతో సహనం నసించిన ఆమె.. భర్తపైనే కులంపేరుతో దూషణ కేసు పెట్టింది. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

‘అతడి’పైనా అత్యాచారయత్నం
యువతులు, మహిళలపై అత్యాచారాలు, అత్యాచారయత్నాలకు సంబంధించిన కేసులు నేటికీ నమోదవుతుండటం చాలవన్నట్లు ఇద్దరు మహిళలు ఓ పురుషుడిపై అత్యాచారయత్నం చేయడం, నగ్నంగా వీడియోలు తీసి అతన్ని బెదిరించడం సనత్‌నగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సదరు వ్యక్తికి మసాజ్‌ థెరపిస్టుగా పరిచయమైన ఓ మహిళ.. భరత్‌నగర్‌ కాలనీకి చెందిన మరో మహిళను పరిచయం చేసింది.

ఇద్దరూ కలిసి అతన్ని భరత్‌నగర్‌ కాలనీలోని మహిళ ఇంటికి తీసుకెళ్లి మసాజ్‌ పేరుతో దుస్తులు విప్పించి అత్యాచారానికి యత్నించారు. అతడు నిరాకరించడంతో నగ్న వీడియోలను తీసి సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించి కొంత డబ్బు గుంజారు. ఆపై ఇంకా డబ్బివ్వాలని డిమాండ్‌ చేయడంతో ఈ ‘లైంగిక వేధింపులు’తట్టుకోలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఆమె అలా... అతడు ఇలా
భిన్న మనస్తత్వాలుగల భార్యభర్తల్ని మనం చూస్తూనే ఉంటాం. రామంతాపూర్‌లో నివసించే ఓ ‘విపరీత’జంట వ్యవహారం ఉప్పల్‌ ఠాణా అధికారుల దృష్టికి వచ్చింది. గతంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో హౌస్‌ కీపర్‌గా పనిచేసిన సదరు మహిళ మద్యానికి బానిసగా మారింది. నిత్యం మద్యం తాగి రోడ్లపై న్యూసెన్స్‌ చేస్తూ పోలీసులకు చిక్కడం పరిపాటిగా మార్చుకుంది.

అంతటితో ఆగకుండా ఏకంగా పోలీసుస్టేషన్‌కే వచ్చి న్యూసెన్స్‌ చేసి వెళ్తుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఆమె భర్త కూడా తక్కువేం కాదు.. చుట్టుపక్కల కాలనీల్లోని ఇళ్ల గోడలు దూకి చెప్పులు, బూట్లు చోరీ చేసేవాడు. సీసీ కెమెరాల ఆధారంతో వన్‌ ఫైన్‌ మారి్నంగ్‌ అతని ఇంటిపై దాడి చేసిన స్థానికులు వందల జతల పాదరక్షలు గుర్తించి పోలీసులకు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement