ఉన్నత విద్యామండలి ‘ఫైనల్‌’ నిర్ణయం | Decision Of Board Of Higher Education On Final Semester Examinations | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యామండలి ‘ఫైనల్‌’ నిర్ణయం

Published Sat, Aug 29 2020 1:15 AM | Last Updated on Sat, Aug 29 2020 1:10 PM

Decision Of Board Of Higher Education On Final Semester Examinations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఉన్నత విద్యామండలి ‘ఫైనల్‌’ నిర్ణయం తీసుకుంది. బీటెక్, ఎంటెక్, డిగ్రీ, పీజీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థుల ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమైంది. పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీల ప్రదానం సరికాదన్న యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. పరీక్షలు నిర్వహించాల్సిందేనని శుక్రవారం స్పష్టం చేసింది. సెప్టెంబర్‌ 30లోగా వీలుకాకపోతే యూజీసీ అనుమతితో ఆయా రాష్ట్రాలు తరువాతనైనా నిర్వహించుకోవచ్చని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం వివిధ యూనివర్సిటీల రిజిస్ట్రార్‌లతో మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సెప్టెంబరు 30లోగా పరీక్షల నిర్వహణకు తాము అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు వర్సిటీలు వెల్లడించాయి. దీంతో పరీక్షల షెడ్యూల్స్‌ను ఒకట్రెండు రోజుల్లో జారీ చేయాలని ఆయా వర్సిటీల రిజిస్ట్రార్‌లకు మండలి ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థులు త్వరలోనే పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

ప్రిపరేషన్‌కు 10 నుంచి 15 రోజులు 
విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు 10 నుంచి 15 రోజుల సమయం ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా సెప్టెంబరు 15 నుంచి వార్షిక పరీక్షలను నిర్వహించేలా యూనివర్సిటీలు పరీక్షల షెడ్యూల్స్‌ సిద్ధం చేసి ప్రకటించాలని శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.  ప్రస్తుతం ఆయా పరీక్షల కోసం ఎదురుచూస్తున్న దాదాపు 3.5 లక్షల మంది బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, సంప్రదాయ డిగ్రీ, పీజీ ఫైనల్‌ ఇయర్‌ ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థుల ఉత్కంఠకు తెరపడనుంది. మరోవైపు సెప్టెంబరు 16వ తేదీ నుంచి బీటెక్‌ ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలను ప్రారంభించాలని నిర్ణయించింది. బీఫార్మసీ పరీక్షల తేదీలను కూడా ఖరారు చేయనుంది. ఎంటెక్‌ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించాలని జేఎన్‌టీయూ భావిస్తోంది. ఉస్మానియా, కాకతీయ, ఇతర యూనివర్సిటీలు కూడా వృత్తి, సాంకేతిక విద్యాకోర్సులతోపాటు సంప్రదాయ డిగ్రీ పరీక్షల షెడ్యూలును జారీ యనున్నాయి. పీజీ పరీక్షలను వీలైతే సెప్టెంబరులో, లేదంటే అక్టోబరులో నిర్వహించే అవకాశం ఉంది. 

అక్టోబరులో బ్యాక్‌లాగ్‌ పరీక్షలు..
వివిధ డిగ్రీ కోర్సులు చదివే ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులకు ఇతర సంవత్సరాలు, ఇతర సెమిస్టర్లకు సంబంధించి ఫెయిలైన సబ్జెక్టులు ఏమైనా ఉంటే(బ్యాక్‌లాగ్స్‌) వాటి పరీక్షలను అక్టోబరులో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మండలి చైర్మన్‌ రిజిస్ట్రార్లను ఆదేశించారు. ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకొని వెళతారు కనుక వారు ఆగిపోకుండా బ్యాక్‌లాగ్స్‌ క్లియర్‌కు అవకాశం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మరోవైపు ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల కోర్సులు పూర్తయినా ప్రస్తుతం పరీక్షలు నిర్వహించకుండానే డిటెన్షన్‌ను ఎత్తివేసి, వారిని ఆపై సంవత్సరానికి ప్రమోట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే వారికి ఇప్పట్లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. అందుకే ప్రస్తుత సెమిస్టర్‌/సంవత్సరానికి సంబంధించిన పరీక్షలను తరువాతే నిర్వహించనున్న నేపథ్యంలో వాటితోపాటు ఈ పరీక్షలను కూడా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement