ఒకే రోజు రెండుసార్లు ఎగిరినట్లు గుర్తింపు
సూపరింటెండెంట్‌ఫిర్యాదుతో ఠాణాలో కేసు
గంజాయి డ్రాప్ కోణంలోనూ దర్యాప్తు
దృష్టి పెట్టిన కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు
సాక్షి, సిటీబ్యూరో: కరుడుగుట్టిన నేరగాళ్లు, మావోయిస్టులు, ఉగ్రవాదులను ఖైదు చేసే చర్లపల్లి కేంద్ర కారాగారంపై అనధికారికంగా ఎగిరిన డ్రోన్ మిస్టరీ వీడలేదు. ఈ ఉదంతం జరిగి ఐదు నెలలు కావస్తున్నా కేసు కొలిక్కి రాలేదు. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు సైతం రంగంలోకి దిగినా ఫలితం దక్కట్లేదు. రెక్కీ, రీల్స్, గంజాయి డ్రాప్ కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు అత్యంత గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది.
అర్ధరాత్రి రెండుసార్లు..
చర్లపల్లి కేంద్ర కారాగారంలోని హైసెక్యూరిటీ బ్యారెక్, ప్రిజనర్స్ బ్యారెక్స్ కేంద్రంగా ఈ ఏడాది మే 21న ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. తెల్లవారుజామున 12.20 గంటలకు ఓసారి, ఒంటి గంట ప్రాంతంలో మరోసారి జైలు పైన ఈ డ్రోన్ ఎగిరింది. ఈ విషయాన్ని వాచ్ టవర్‌లో విధులు నిర్వర్తిస్తున్న జైలు వార్డర్లతో పాటు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు (టీఎస్‌ఎస్‌పీ) సిబ్బంది గుర్తించారు. ఈ బ్యారెక్స్‌తో పాటు స్టాఫ్ క్వార్టర్స్, జైలు ప్రాంగణంలోనూ ఈ డ్రోన్ తిరిగినట్లు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఫిర్యాదుతో చర్లపల్లి పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
వివిధ కోణాల్లో సాగుతున్న దర్యాప్తు...
ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తుండగా... కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే పలు బృందాలు జైల్లో డ్రోన్ ఎగిరిన ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. ఈ వ్యవహారంలో ప్రధానంగా మూడు కోణాలను అధికారులు అనుమానిస్తున్నారు. ఈ జైల్లో ఉన్న ఖైదీనికి తప్పించడానికి ఏదైనా కుట్ర జరుగుతోందా? అనే కోణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ స్కెచ్‌లో భాగంగానే జైలు ప్రాంగణం రెక్కీ కోసం డ్రోన్ వినియోగించి ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో పాటు సోషల్‌మీడియా క్రేజ్ ఉన్న ఆకతాయిలు ఎవరైనా తమ ఖాతాల్లో పోస్టు చేయడానికి చర్లపల్లి జైలు నైట్‌వ్యూని డ్రోన్ ద్వారా షూట్ చేశారా? అనేదీ దర్యాప్తు
చేస్తున్నారు.
బంతి పోయి డ్రోన్ వచి్చందా..?
ఈ రెండు కోణాలతో పాటు గంజాయి సరఫరా అంశాన్నీ పోలీసులు, నిఘా వర్గాలు పరిగణలోకి తీసుకున్నాయి. వివిధ జైళ్లలో ఉన్న ఖైదీలకు బయట నుంచి గంజాయి సరఫరా జరుగుతోందనే ఆరోపణలు ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి. గతంలో కొందరు ఖైదీల వద్ద ఈ సరుకు పట్టుబడినట్లూ తెలుస్తోంది. ఒకప్పుడు గంజాయి ప్యాకెట్లను చిన్న బంతుల్లో పెట్టి, నిర్దేశిత ప్రాంతంలో ప్రహరీ గోడ పై నుంచి జైల్లోకి విసిరేవాళ్లు. నిఘా పెంచడం, వాట్ టవర్ల ఏర్పాటు సహా అనేక చర్యలు తీసుకున్న జైల్ అధికారులు దీనిని కట్టడి చేశారు. దీంతో ఖైదీలకు గంజాయి లేదా మరో పదార్థం, వస్తువు అందించడానికి వారి సంబం«దీకులు ఎవరైనా ఇలా డ్రోన్ వాడి ఉంటారనీ అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలోనూ ముందుకు వెళ్తున్నారు.
కష్ట సాధ్యమవుతున్నమూలాల వేట...
ఈ కేసును కొలిక్కి తీసుకురావడానికి పోలీసులు, నిఘా వర్గాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఖైదీల ప్రొఫైల్, సోషల్‌మీడియాలోని వీడియోలు అధ్యయనం చేయడంతో పాటు సాంకేతికంగా ముందుకు వెళ్తున్నారు. అయితే డ్రోన్‌కు సిమ్‌కార్డు వంటివి ఉండకపోవడం, పూర్తిగా రిమోట్ కంట్రోల్‌తో పని చేసేది కావడంతో ఎలాంటి ఆధారం లభించట్లేదు. ఫలితంగా ఈ డ్రోన్‌కు మూలం ఎవరనేది తేలట్లేదు. జైలుతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో మే 1 నుంచి నమోదైన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. జైలు పరిసరాల్లో నివసించే వారి వివరాలు సేకరించి, విశ్లేషించినా ఎలాంటి క్లూ లభించలేదు. గడిచిన ఏడాది కాలంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లలో జరిగిన డ్రోన్ల క్రయవిక్రయాల పైనా దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment