సాయంత్రం 6 గంటలకు పార్టీల క్యాంపెయినింగ్‌కు తెర
ఇంటింటి ప్రచారంపైనా నిషేధం.. దృశ్యరూపక ప్రకటనలకూ వీల్లేదు
సోమవారం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు జరగనున్న పోలింగ్
కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నికకు కూడా..
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హోరాహోరిగా సాగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం ఆరు గంటలకు తెరపడనుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇది సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. ఆ సమయం దాటిన తరువాత నుంచి బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారం తదితర ప్రచారంపై నిషేధం కొనసాగనుంది. దృశ్యరూపకంగా ఉండే ఏ ప్రకటన కూడా ప్రచారం చేయడానికి వీల్లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి (ఉప ఎన్నిక) సోమవారం పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది..
బరిలో 525 మంది అభ్యర్థులు..
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం ఏప్రిల్ 18న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వం కూడా ప్రారంభమైంది. లోక్‌సభకు మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి 15 మంది పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ అన్ని సీట్లలోనూ పోటీ చేస్తుండగా సీపీఎం, ఎంఐఎం ఒక్కోచోట బరిలో నిలిచాయి.
అగ్ర నేతల ప్రచారం..
నామినేషన్ల పర్వం నుంచి విస్తృత ప్రచారం ప్రారంభమవగా రాష్ట్ర, జాతీయ స్థాయిలోని ఆయా పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు పలువురు బీజేపీపాలిత రాష్ట్రాల సీఎంలు కూడా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం సాగించారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక బీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, కార్యనిర్వహాక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రచార బాధ్యతనంతా మోశారు. ఈసారి భారీ బహిరంగ సభలు అతితక్కువగా జరగ్గా ప్రజలను కలుసుకొనేలా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లకు అన్ని పార్టీలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి.
పరస్పరం దూషణలపర్వం..
ఈసారి ఎన్నికల ప్రచారంలో పార్టీల దూషణలపర్వం తారస్థాయికి చేరింది. ఆరు గ్యారంటీలంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చినా.. అమలు చేయలేదని బీఆర్‌ఎస్, బీజేపీలు తీవ్రంగా విమర్శించాయి. గత పదేళ్లలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని, కొత్త రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. మరోవైపు బీజేపీ తాము మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే రద్దు చేస్తామని బదులిచ్చింది.
ప్రలోభాలను అడ్డుకోవడంపై ఈసీ నజర్..
నేటి సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుండటంతో పోలింగ్ జరిగే లోగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకొనేందుకు ఈసీ కృతనిశ్చయంతో ఉంది. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు సీ–విజల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడైనా ప్రలోభాలు కొనసాగుతుంటే సమాచారం ఇవ్వాలని, తక్షణమే స్పందిస్తామని ఎన్నికల సంఘం హామీ ఇస్తోంది. ఇప్పటివరకు 180 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారు, వెండి ఆభరణాలు, తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment