సాక్షి, హైదరాబాద్: విద్యుత్ టారీఫ్ (చార్జీల పెంపు) ప్రతిపాదనలను 7 రోజుల్లోగా సమర్పించాలని దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఆదేశించింది. నవంబర్ 30న డిస్కంలు సమర్పించిన 2022–23 ఆర్థిక సంవత్సరాల వార్షికాదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్)ల్లో టారీఫ్ ప్రతిపాదనలు లేవని, వీటిని సమర్పించినట్లు పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేసింది.
ఈ మేరకు డిస్కంల సీఎండీలకు ఈఆర్సీ గురువారం లేఖ రాసింది. వచ్చే ఆర్థిక సంవత్సరాని(2022–23)కి సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించిన నాటి నుంచి 120 రోజుల తర్వాతే రాష్ట్రంలో చార్జీల పెంపునకు అనుమతిస్తామని ఈఆర్సీ స్పష్టం చేసింది. దీంతో డిస్కంలకు ఎదురు దెబ్బతగిలింది. ప్రతిపాదనలు ఎంత ఆలస్యం చేస్తే చార్జీల పెంపులో అంత ఆలస్యం జరగనుంది. గడువులోగా టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించకపోతే ఏఆర్‌ఆర్‌లను ఈఆర్సీ తిరస్కరించే అవకాశాలున్నట్లు తెలిసింది.
120 రోజులు ఎందుకంటే?..
డిస్కంలు ఈఆర్సీకి ఏఆర్‌ఆర్‌తో పాటు టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత నిబంధనల ప్రకారం వాటిని బహిర్గతం చేసి రాతపూర్వకంగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరిం చాలి. డిస్కంలతో పాటు ఈఆర్సీ వెబ్‌సైట్‌లో వీటి ని ప్రదర్శిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది.
డిస్కంల టారిఫ్ పెంపు ప్రతిపాదనలు, వాటిపై వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, డిస్కంల ప్రతిస్పందనలపై ఈఆర్సీ అధ్యయనం జరిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెంచాల్సిన విద్యుత్ చార్జీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ప్రక టిస్తుంది. సుదీర్ఘ ప్రక్రియ కావడంతో 120 రోజుల సమయాన్ని ఇందుకు కేటాయిస్తూ కేంద్ర ప్రభు త్వం నిబంధనలను రూపొందించింది. అందుకే ఏటా నవంబర్ 30లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సం బంధించిన ఏఆర్‌ఆర్‌లు, విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పి ంచాలని టారిఫ్ నిబంధనలు పేర్కొంటున్నాయి.
వ్యూహాత్మకంగానే ఆలస్యం..
విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజావ్యతిరేకత నుంచి ఉపశమనం పొందడానికే డిస్కంలు టారిఫ్ ప్రతి పాదనలను గడువులోగా సమర్పించకుండా వ్యూహాత్మకంగా వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి. చివరిసారిగా 2018–19కిసంబంధించిన ఏఆర్‌ఆర్‌లను ఈఆర్సీకి సమర్పించగా, అప్పట్లో చార్జీలు పెంచలేదు. 2019–20, 2020– 21 ఏఆర్‌ఆర్‌లను ఇవ్వలేదు. 2021–22 ఏఆర్‌ఆర్‌లను గడువు తీరాక సమర్పించాయి. 2022–23 ఏఆర్‌ఆర్‌లను సమర్పించినా, టారిఫ్ ప్రతిపాదనలను వాయిదా వేసుకున్నాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి చార్జీలు పెంచాలని భావించినా, 120 రోజుల నిబంధన లో ఈఆర్సీ రాజీపడకపోవడంతో డిస్కంలకు ఎదురు దెబ్బతగిలింది.
Comments
Please login to add a commentAdd a comment