కరాచి బేకరీ పరిశ్రమలో..అగ్నిప్రమాదం | Fire Accident In Karachi Bakery Industry In Shamshabad, 15 Workers Were Seriously Injured - Sakshi
Sakshi News home page

కరాచి బేకరీ పరిశ్రమలో..అగ్నిప్రమాదం

Published Fri, Dec 15 2023 5:04 AM | Last Updated on Fri, Dec 15 2023 8:47 PM

Fire in Karachi Bakery Industry - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌: గగన్‌పహాడ్‌ పారిశ్రామిక వాడలోని కరాచి బేకరీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పైప్‌లైన్‌ ద్వారా సరఫరా అయ్యే గ్యాస్‌ లీక్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాప్తిచెంది 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని భావిస్తున్నారు.

ఆర్‌జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ గగన్‌పహాడ్‌ పారిశ్రామిక వాడలో కరాచి బేకరీకి సంబంధించిన ఆహార తయారీ పరిశ్రమలో ఉదయం 9.40 గంటల సమయంలో ప్రధాన వంటశాలగా ఉన్న ప్రాంతంలో 20 మంది కార్మికులు కేక్‌లు, బిస్కెట్లు తయారు చేస్తున్నారు. పరిశ్రమలో భారీ స్టవ్‌లకు గ్యాస్‌ను పైప్‌లైన్‌ ద్వారా సరఫరా చేస్తుంటారు.

స్టవ్‌ల వద్దకు వచ్చే పైప్‌లైన్‌లో ఓ చోట లీకేజీ ఏర్పడటంతో మంటలు ఒక్కసారిగా బయటికి వ్యాపించి అక్కడ పనిచేస్తున్న 15 మంది కార్మికులకు అంటుకున్నాయి. దీంతో వెంటనే గ్యాస్‌ సరఫరాను నిలిపివేసిన పరిశ్రమ యాజమాన్యం, గాయపడిన కార్మికులను పరిశ్రమకు చెందిన ఆటోల్లోనే శంషాబాద్‌ ట్రైడెంట్‌ ఆస్పత్రికి తరలించింది. అనంతరం ఆర్‌జీఐఏ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.  

నిర్లక్ష్యంతోనే ప్రమాదం.. 
కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదంలో కార్మికులకు మంటలంటుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 15 మంది కార్మికుల్లో తీవ్రంగా గాయాలైన పదమూడు మందిని డీఆర్‌డీఎల్‌ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మిగతా వారు ట్రైడెంట్‌ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కాగా, అగ్నిప్రమాదంలో గాయపడిన పదిహేను మంది కూడా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారే.

బలరాం (25), శుభం ప్రజాపతి (19), అదితి కుమార్‌ (19), సందీప్‌ ప్రజాపతి (27), దీపక్‌ శుక్లా (18), అన్వే‹Ùకుమార్‌ (20), ముఖే‹Ùకుమార్‌ (28), దారే సింగ్‌ (37), సోను (30), కోమల్‌ కిషోర్‌ (24), ప్రమోద్‌కుమార్‌ (23), సుజిత్‌ (19), సందీప్‌కుమార్‌ (25), సన్నీ (20), ప్రదీప్‌ (20)లలో ఐదుగురికి యాభై శాతం నుంచి ఎనభై శాతం వరకు కాలిన గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  

గతంలోనూ ఇదే పరిశ్రమలో... 
గతేడాది అక్టోబర్‌లో కూడా ఈ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఘటన రాత్రి సమయంలో జరగడం, కార్మికులెరూ  లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దేశీయంగా, అంతర్జాతీయ బ్రాండెడ్‌గా ఉన్న పరిశ్రమలో తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం కార్మిక శాఖతో పాటు పరిశ్రమ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.  

ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి 
కరాచి పరిశ్రమలో అగ్నిప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి సీఎం ఆదేశాలు జారీచేశారు.  

ఒక్కసారిగా మంటలంటుకున్నాయి.. 
మేము ఇరవై మంది అప్పుడే కేకులు, బిస్కెట్లు తయారీ ప్రారంభించాం. స్టవ్‌లకు సరఫరా అయ్యే గ్యాస్‌పైప్‌ లైన్‌ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో 15 మందికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి.      – ప్రమోద్‌కుమార్, బాధితుడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement