సాక్షి, హైదరాబాద్: గోడౌన్‌లు, రైస్‌మిల్లులలో ధాన్యాన్ని ఖాళీ చేసేందుకు, విక్రయించేందుకు పిలిచిన టెండర్ల కేటా యింపులో రూ.750 కోట్ల మేర గోల్‌మాల్ జరిగిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. మంగళవారం రాత్రి అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేస్తే, నాలుగు సంస్థలే అర్హత సాధించాయని, ఆ సంస్థలేవో ఇప్పటివరకు బహిర్గతం చేయలేదన్నారు.
టెండర్లు దక్కించుకున్న ఆ నాలుగు సంస్థలు ఇప్పటివరకూ 35 కిలోల ధాన్యాన్ని కూడా సేకరించలేదని, 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి బదులుగా మిల్లర్ల నుంచి ఒక్కో క్వింటాలుకు రూ. 2,223 వసూలు చేశారని గంగుల ధ్వజమెత్తారు. ధాన్యానికి బదులు డబ్బులు వసూలు చేస్తే మిల్లుల్లో, గోడౌన్‌లలో ఉన్న ధాన్యం ఎలా ఖాళీ అవుతుందని ప్రశ్నించారు.
అలాగే గురుకులాలు, మధ్యాహ్న భోజనం కోసం పాఠశాలల్లో ఇచ్చే సన్న బియ్యంకు అవసరమైన 1.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించి, అవే సంస్థల నుంచి కిలో బియ్యాన్ని రూ.57కు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందులో కూడా కుంభకోణం ఉందని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment