అధికారులు సెలవులు రద్దు చేసుకోవాలి
అత్యవసర సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పురపాలక, విద్యుత్, పంచాయతీరాజ్, హైడ్రా, నీటిపారుదల శాఖల అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలపై ఆదివారం ఆయన అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణా రావుతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
అధికారులెవరూ సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకుని సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని కోరారు. అత్యవసర సేవల శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి నిరంతరం సమీక్షిస్తుండాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎం కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. కాంగ్రెస్ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తాం: పీఎం
రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులు, వాటితో జరిగిన నష్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షం, వరదతో వాటిల్లిన నష్టాన్ని ప్రధానికి సీఎం రేవంత్ వివరించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తక్షణ సహాయక చర్యలను, జాగ్రత్తలను తెలియజేశారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానికి వివరించారు.
ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన సాయం అందిస్తామన్నారు. కాగా, రాష్ట్రంలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు రక్షణగా నిలవాలని టీపీసీసీ కోరింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు.
వరద పరిస్థితిని అమిత్‌షాకు వివరించిన సీఎం
ఆదివారం రాత్రి సీఎం ఎ.రేవంత్‌రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఫోన్ చేశారు. వర్షాలు, వరదల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న ఆయన అవసరమైన తక్షణ సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టాన్ని అమిత్‌షాకు సీఎం రేవంత్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment