కుక్కల దాడి ఘటనలపై హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు
మనుషులపై దాడికి పరిష్కార మార్గం కావాలి
నిపుణులను సంప్రదించి నివేదిక ఇవ్వాలని ఆదేశం
కుక్కల దాడులు ప్రభుత్వానికి కూడా ఆందోళన కలిగిస్తున్నాయన్న ఏజీ
సాక్షి, హైదరాబాద్: కుక్కల దాడి సమస్య ఒకరిది కాదని, అందరిదీ అని హైకోర్టు అభిప్రాయపడింది. మనుషులపై దాడి చేయకుండా పరిష్కారం కావాలని.. నిపుణులను సంప్రదించి నివేదిక ఇవ్వాలని జంతు జననాల నియంత్రణ కమిటీని ఆదేశించింది. వీధి కుక్కలకు స్టెరిలైజ్ చేసి శిశువులు, వృద్ధులపై దాడులు చేయకుండా నిరోధించలేమని వ్యాఖ్యానించింది. దాడులు చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళిక రూపొందించాలని ఆదేశించింది.
జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం, జంతు సంరక్షణ సంస్థలు, జంతు జనన నియంత్రణ కమిటీలు పటిష్ట పరిష్కారం చూపి.. పసికందులపై వీధికుక్కలు దాడి చేసి చంపేస్తున్న ఘటనలను అరికట్టేందుకు మార్గం వెతకాలని చెప్పింది. జూన్ 28న పటాన్‌చెరు ఇస్నాపూర్‌లో వీధి కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు విశాల్ మృతి చెందాడు. బిహార్‌కు చెందిన వీరి కుటుంబం పొట్టకూటి కోసం రాష్ట్రానికి వచ్చింది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ దారుణంపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. గతంలో ఇదే అంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను దీనికి జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జస్టిస్ అలోక్ అరాధే.. హైదరాబాద్‌లో వీధికుక్కల దాడికి గురైన పసికందు వార్త క్లిప్పింగ్‌ను కోర్టు హాల్‌లో చూపించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం చాలా దారుణమన్నారు.
నిబంధనలు అమలు చేస్తున్నాం: ఏజీ
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘అనుమమ్ త్రిపాఠి వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను, జంతు జననాల నియంత్రణ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రంలో 3,79,148 కుక్కలున్నాయి. నిబంధనల ప్రకారం కుక్కలకు స్టెరిలైజేషన్, ఇమ్యూనైజేషన్ చేసి మళ్లీ అదే ప్రాంతంలో వదిలేస్తున్నాం. కుక్కల దాడులు ప్రభుత్వానికి కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.
జంతు సంక్షేమ సంఘాలతో కూడా చర్చలు జరుపుతాం’ అని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్షల్లో కుక్కలుండగా.. రోజుకు 30–40 కుక్కలకు వ్యాక్సిన్ చేస్తున్నారని న్యాయవాది వేణుమాధవ్ చెప్పారు. ఈ కేసులో తనను ఇంప్లీడ్ చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. కుక్కల దాడుల బారినపడిన బాధితులను ఆదుకోవడానికి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలని సూచించింది. తదుపరి విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment