పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్, పొన్నం, పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం సాయంత్రం రాజ్‌భవన్ ప్రాంగణంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేతలు కె.కేశవరావు, చిన్నారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఎంపీలు మల్లు రవి, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే భారీ వర్షం మొదలైంది. అయితే వాటర్‌ప్రూఫ్ టెంట్లు వేసి ఉండటంతో జోరు వానలోనూ కార్యక్రమం యథావిధిగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి హాజరైన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, పద్మ పురస్కార గ్రహీతల వద్దకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లి పలకరించారు. చివర్లో గవర్నర్ అతిథుల టేబుల్స్ వద్దకు వెళ్లి అందరినీ పలకరించారు. కాగా, వర్షపు నీటి ప్రవాహం టేబుల్స్ కిందకి చేరడంతో చివర్లో కొంత అసౌకర్యం కలిగింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ నేతలు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
భిన్నత్వంలో ఏకత్వమే మన బలం
మాతృభూమికి స్వాతంత్య్రం కోసం పోరాడిన అసంఖ్యాక దేశభక్తుల నిస్వార్థ త్యాగాలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన రాజ్‌భవన్ దర్బార్ హాల్ ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.
గడిచిన ఏడు దశాబ్దాల్లో దేశం అద్భుత ప్రగతిని సాధించిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన అతిపెద్ద బలమని స్పష్టం చేశారు. దేశం, రాష్ట్ర అభివృద్ధికి అకుంఠిత దీక్షతో పనిచేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్‌భవన్ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment