సాక్షి, హైదరాబాద్: సుమారు 20 లీటర్ల మూత్రం నిలిచిపోయి సమస్యాత్మకంగా మారిన భారీ మూత్రపిండాన్ని ఎర్రమంజిల్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ (ఏఐఏన్‌యూ) వైద్యులు శస్త్రచికిత్స చేసి విజయవంతంగా తొలగించారు. మంగళవారం ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 47 ఏళ్ల వయసు గల రోగికి దాదాపు పదేళ్లుగా పొట్ట విస్తీర్ణం బాగా పెరిగి, తరచూ నొప్పి వస్తుండేది.
రోగి ఈ విషయంపై నిర్లక్ష్యం చేయడంతో ఇటీవల ఆకలి తగ్గిపోవడం, వాతులు కావడంతో పాటు కడుపునొప్పి ఎక్కువైంది. దీంతో ఆసుపత్రిలో సంప్రదించగా మూత్ర పిండం నుంచి మూత్ర విసర్జన కాకపోవడంతో వ్యర్థాలు బాగా నిలిచిపోయి పొట్ట ఉబ్బిందని, దీని వల్ల ఇతర అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు గ్రహించారు. ఎంతో జాగ్రత్తగా శస్త్ర చికిత్స చేసి రోగి ఎడమ మూత్రపిండాన్ని తొలగించారు.
రోగి త్వరగా కోలుకోవడమే కాకుండా సాధారణ ఆహారం తీసుకుంటున్నాడని డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్ తెలిపారు. ఎంతో క్లిష్టమైన ఈ శస్త్ర చికిత్సలో తనకు వైద్యులు రాజేష్, అమిష్‌తోపాటు నర్సింగ్ సిబ్బంది సహాయం అందించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment