చార్మినార్: మట్టి గాజులు మొదలు మెటల్ గాజుల దాకా... 5 రూపాయల నుంచి 10 వేల రూపాయల బ్యాంగిల్స్ వరకు... రకరకాల డిజైన్లు, రంగురంగుల గాజులు ఒకేచోట లభించే ప్రాంతం భాగ్యనగరంలోని ప్రఖ్యాత లాడ్‌బజార్. పాతబస్తీలో షాపింగ్ అంటే అతివలకు ఠక్కున గుర్తొచ్చే దుకాణ సముదాయం ఇదే. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే ఇక్కడి దుకాణాలు రంజాన్ షాపింగ్ నేపథ్యంలో లభించే ప్రత్యేక ఆఫర్లతో మరింతగా కిటకిటలాడుతున్నాయి. నైట్ బజార్‌లో విద్యుత్ దీపాల వెలుగుల్లో దుకాణాలు వెలిగిపోతున్నాయి.
ఎన్నో రకాలు...
లాడ్ బజార్‌లో మట్టి గాజులతోపాటు గోట్లు, మెటల్, డైమండ్స్, సీసం, బ్రాస్, ఫైబర్, మిర్రర్, ఎనామిల్ తదితర ఫ్యాషన్ గాజులు లభిస్తాయి. రోజువారీ వాడకానికి, పార్టీవేర్ కోసం ధరించేందుకు రకరకాల గాజులు దొరుకుతాయి. అయితే ఎన్ని రకాలు ఉన్నా ఎక్కువ మంది మనసును దోచేవి, ఖ్యాతి గడించినవి మాత్రం రాళ్ల గాజులే.
లాడ్‌బజార్ అంటే....
లాడ్లా అంటే గారాబం. ప్రేమ. అనురాగం. ఉర్దూ భాషలో తమకు ఇష్టమైన వారిని ముఖ్యంగా చిన్నారులను లాడ్లా అని సంబోధిస్తుంటారు. తమ ప్రేమకు, అభిమానానికి గుర్తుగా ఇక్కడ నుంచి కానుకను కొని బహూకరిస్తుండటంతో దీనికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. మహ్మద్ కులీకుతుబ్ షా తన ప్రేయసి భాగమతికి లాడ్‌బజార్‌లోని గాజులనే బహుమతిగా ఇచ్చారని చెబుతుంటారు. అప్పట్లో చార్మినార్ నుంచి గోల్కొండకు పురానాపూల్ మీదుగా వెళ్లాల్సి రావడం, పురానాపూల్‌కు వెళ్లడానికి లాడ్‌బజార్ ప్రధాన రహదారి కావడంతో ఈ బజార్‌కు ప్రచారం ఏర్పడి మంచి గుర్తింపు లభించింది.
లక్షల్లో వ్యాపారం....
ప్రస్తుతం లాడ్‌బజార్‌లో దాదాపు 250కిపైగా దుకాణాలు లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. రంజాన్ మాసం సందర్భంగా రోజుకు సగటున ఒక్కో దుకాణంలో రూ. 50 వేల నుంచి రూ. లక్షకుపైగా కొనుగోళ్లు జరుగుతున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. అంటే అన్ని దుకాణాలలో జరిగే వ్యాపారం కలిపితే రూ. 2 కోట్లు ఉంటుందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment