వానలు వెలిశాయి. వరదలు తగ్గాయి. కానీ వరదలతో పాటే సర్వం కోల్పోయిన బాధితులు ఇంకా తేరుకోలేదు. పది రోజుల పాటు నీట మునిగిన హబ్సిగూడ కాలనీలో.. ఇప్పుడు ఖాళీ ఇళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. పోగొట్టుకున్న వస్తువుల కోసం దేవులాడుకొనే మనుషుల ఆవేదన కనిపిస్తోంది. రవీంద్రనగర్, లక్ష్మీనగర్, సాయిచిత్రానగర్ తదితర కాలనీల్లో ఇళ్లంటే ఖాళీ గోడలు, పై కప్పులు, బురద పేరుకున్న గచ్చు మాత్రమే. పాడైన సోఫాలు, మంచాలు, దుప్పట్లు, వంటపాత్రలు, టీవీలు, ఫ్రీజ్‌లు అక్కడక్కడా రోడ్లపై కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి.
సాక్షి, హైదరాబాద్: ఇరవై ఏళ్ల క్రితమే కల్వకుర్తి నుంచి వచ్చిన విజయ, నర్సింహారావు దంపతుల కుట్టుమిషన్‌లు.. నందూ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే విలువైన పుస్తకాలు, ఆన్‌లైన్ చదువుల కోసం తెచ్చిన మొబైల్ ఫోన్‌లు, ఇందిర కిరాణా దుకాణం, సంపత్ హెయిర్ కటింగ్ సెలూన్... అన్నీ శిథిల జ్ఞాపకాలే. రవీంద్రనగర్ కాలనీకి చెందిన అభిజిత్‌రెడ్డి మాటల్లో చెప్పాలంటే ‘ఇప్పుడు అక్కడ ఏం మిగిలిందని... కట్టుబట్టలు... వరద మిగిల్చిన కష్టాలు తప్ప... పదిరోజుల క్రితం నీటమునిగిన హబ్సిగూడ కాలనీలే కాదు. గ్రేటర్‌లోని వందలాది కాలనీల్లో నిరాశ్రయులైన వేలాది కుటుంబాలు, లక్షలాది ప్రజలకు ఇప్పుడు వరద వదిలి వెళ్లిన కష్టాలు, బురద నిండిన రోడ్లు మాత్రమే మిగిలాయి. ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వానలు.. వరదలు మిగిల్చిన బాధలు వెల్లడయ్యాయి..
చెదిరిన గూడు...
వరదలో కొట్టుకుపోగా మిగిలిన వస్తువులను డాబాపైన ఆరబెట్టుకొని బిక్కుబిక్కుమంటూ నిస్సహాయంగా చూస్తున్న విజయ, నర్సింహారావు దంపతులు 20 ఏళ్ల క్రితం నగరానికి వచ్చారు. ఇంట్లో చాలా వస్తువులు నీటిపాలయ్యాయి. బియ్యం, ఉప్పు, పప్పులతో సహా అన్నీ పోయాయి. ఇప్పుడు హోటల్ నుంచి ఏదో ఒకటి తెచ్చుకొని తింటున్నారు. రాత్రి పూట కటిక నేలపైనే నిద్రిస్తున్నారు. ఇదంతా ఒకవైపు అయితే.. మరోవైపు ఆమె ప్రాణప్రదంగా భావించే కుట్టుమిషన్ కూడా నీటిలో కొట్టుకుపోయింది. ఇరవై ఏళ్లుగా ఉపాధినిచ్చిన కుట్టుమిషన్ అది. దానితో పాటే దసరా కోసం తెచ్చిపెట్టిన డ్రెస్ మెటీరియల్స్, చీరలు, చుట్టుపక్కల మహిళల నుంచి తీసుకున్న ఆర్డర్‌లు అన్నీ పోయాయి. ‘కనీసం రూ.5 లక్షల విలువైన వస్తువులు వరదలో పోయాయి. ఇప్పుడు ఉన్నవాటిలో చాలా వరకు పనికి రాకుండా ఉన్నాయి. ఈ వయసులో పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకోగలమా. టైలరింగ్ అంటే చాలా ఇష్టం. కానీ కుట్టుమిషన్ కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేవ్..’ విజయ ఇంట్లోనే కాదు. ఆమె కళ్లల్లోనూ నీరింకిపోయింది. బహుశా ఏడ్చేందుకు కూడా ఏమీ మిగలలేదు.
కూలిన బతుకులు...
మేఘావత్ నందు, సరోజ దంపతులు రెండేళ్ల క్రితం రవీంద్రనగర్ కాలనీకి వచ్చారు.అక్కడే ఒక గుడిసె వేసుకుని ఉంటున్నారు. ఆ నేలకు ప్రతి నెలా రూ.1000 చొప్పున అద్దె చెల్లిస్తారు.సరోజ ఉదయంపూట ఇళ్లల్లో పని చేస్తుంది. నందు కూలీకి వెళ్తాడు, సాయంత్రం ఇద్దరూ కలిసి జొన్న రొట్టెలు చేసి అమ్ముతారు. ఇద్దరు కూతుళ్లు. వాళ్లను బాగా చదివించేందుకు కష్టపడుతున్నారు. రూ.9000 ఖర్చు చేసి ఇద్దరికీ పుస్తకాలు తెచ్చారు. ఆన్‌లైన్ చదువుల కోసం మరో రూ.20 వేలు ఖర్చు చేసి రెండు మొబైల్ ఫోన్‌లు కొనుక్కొచ్చారు. ఇదంతా వాళ్ల శక్తికి మించిన ఖర్చే కానీ పిల్లలు బాగా చదువుకోవాలనే ఆశ కొద్దీ భారమైనా భరించారు. కానీ అన్నింటినీ ఒక్క వాన తుడిచిపెట్టింది. ఆ రాత్రి కోసం వండుకున్న అన్నం, కూరలతో సహా అన్నీ వరదలపాలయ్యాయి. పుస్తకాలు, సర్టిఫికెట్‌లు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, టీవీ, వంటగ్యాస్, స్టౌ, బియ్యం...ఏదీ మిగల్లేదు. ‘‘కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు.ఇప్పుడు ఎవరో ఒకరు అన్నం పెడుతున్నారు. రాత్రి పూట బాల్కనీల్లో తలదాచుకుంటున్నాం. దేవరకొండ నుంచి వచ్చాం. పిల్లలను బాగా చదివించాలనుకున్నాం. కానీ మరోసారి సెల్‌ఫోన్‌లు,పుస్తకాలు కొనగలమా..’’నందు ఆవేదన ఇది.
ఏం మిగిలిందంటే...
అభిజిత్‌రెడ్డిది ఉమ్మడి కుటుంబం. పది మంది కుటుంబ సభ్యులు.పెద్ద ఇల్లు. పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. కానీ ఆ రాత్రి ఏకధాటిగా కురిసిన వర్షం ఇంటిల్లిపాదికి కునుకు లేకుండా చేసింది. ఇల్లంతా నీట మునిగింది. అందరూ అతి కష్టంగా డాబాపైకి చేరుకున్నారు. మరుసటి రోజు పడవ సహాయంతో బయటకు వచ్చి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ ఇంటి నిండా బురద మాత్రమే మిగిలింది. ‘‘ ఏం మిగిలిందని చెప్పాలి. 6 క్వింటాళ్ల బియ్యం నీటిలో కలిసిపోయాయి. రూ.లక్ష ఖరీదైన ఫ్రిజ్ పోయింది.టీవీలు,మంచాలు,పరుపులు,బెడ్‌షీట్‌లు, బుల్లెట్, ఇన్నోవా కారు పాడయ్యాయి. రెండు లాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు.. ఐప్యాడ్ అన్నీ పోయాయి. కనీసం రూ.25 లక్షల నష్టం వాటిల్లింది. ఒక్క వస్తువు కూడా పనికొచ్చేలా లేదు, ఇంటి గోడలు కూడా పాడయ్యాయి. తిరిగి బాగు చేసుకొంటే తప్ప ఇంట్లో ఉండలేము.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా కోల్పోయారు...
లక్ష్మీనగర్‌కు చెందిన నిర్మల అపార్ట్‌మెంట్‌లో ఆరు కుటుంబాలు సర్వం కోల్పోయాయి. ఆ ఇళ్లల్లో పాడైన వస్తువులను జీహెచ్‌ఎంసీ వాహనాల్లో తరలించారు. ‘‘అధికారులు ఇటు వైపు తొంగి చూడడం లేదు.కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదు. పరిహారం కూడ ఎవరికి ఇస్తున్నారో తెలియదు.చాలా బాధగా ఉంది..’’ అని అపార్ట్‌మెంట్ యజమాని నిర్మల చెప్పారు.
వరంగల్ నుంచి వచ్చి రవీంద్రనగర్ కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్న ఇందిర, రమేష్ దంపతులు కిరాణా షాపులో కనీసం రూ.6 లక్షల విలువైన సరుకును కోల్పోయారు. ఇల్లు కూడా నీట మునిగింది. ‘‘ అప్పు కోసం తిరుగుతున్నాను. వానొచ్చినా, వరదొచ్చినా బతకాల్సిందే కదా. కిరాణా షాపు తప్ప మరేం ఆధారం ఉంది. అందుకే మళ్లీ షాపు పెట్టుకొనేందుకు అప్పు చేయవలసి వస్తుంది.’’ అని చెప్పారు రమేష్.
Comments
Please login to add a commentAdd a comment