సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలోని కోవిడ్– 19 కంట్రోల్ రూమ్‌కు వస్తున్న ఫోన్‌కాల్స్ పరంపర పెరుగుతోంది. కరోనాకు సంబంధించిన అనుమానాలున్నాయంటూ ఎక్కువగా ఫోన్లు వస్తున్నాయి. గతంలో జ్వరం, జలుబు, దగ్గు వంటివి ఉన్నవారు ఫోన్‌చేసేవారు. తమకు సమీపంలోని పరీక్ష కేంద్రం ఎక్కడుందో తెలపాలని అడిగేవారు. ప్రస్తుతం కరోనా లక్షణాలు మారాయని, కొందరికి ఏ లక్షణాలు కనిపించకున్నా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయని అందుతున్న సమాచారంతో ఏ మాత్రం అస్వస్థతగా ఉన్నా ‘ఇది కరోనానేనా’ అంటూ అనుమానంతో ఫోన్లు చేస్తున్నవారి సంఖ్య పెరిగింది. గతంలో కరోనాగా అనుమానం ఉందంటూ వచ్చే ఫోన్లతోపాటు కంటైన్మెంట్ జోన్లలోని వారు తమకు మందులు కావాలని, సరుకులు కావాలని ఫోన్లు చేసేవారు. ముఖ్యంగా ఉపాధి లేని పలువురు ఆహారం కోసం ఫోన్లు చేసేవారు. వారికి అన్నపూర్ణ భోజనాలు పంపించేవారు. అప్పట్లో రోజుకు దాదాపు 600 ఫోన్‌కాల్స్ వచ్చేవి. వాటిల్లో అన్నపూర్ణ భోజనం కోసం.. కంటైన్మెంట్ జోన్ల నుంచి ఎక్కువ కాల్స్ ఉండేవి. ప్రస్తుతం కోవిడ్ కాల్‌సెంటర్‌కు వస్తున్న కాల్స్ గణనీయంగా తగ్గాయి. రోజుకు 90– 150 మధ్య వస్తున్నాయి. ఇందులో అత్యధికంగా కరోనాగా అనుమానం ఉందంటూ వస్తున్న ఫోన్లే ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటివి రోజుకు కనీసం 25కు తగ్గకుండా వస్తున్నాయి. ఒక్కోరోజు 70కిపైగా ఇవే ఉంటున్నాయి. ఈ నెల 14న వచ్చిన మొత్తం కాల్స్ 108 కాగా, అందులో 71 కాల్స్ కరోనాపై సందేహంతో చేసినవే. తాజాగా సోమవారం జీహెచ్‌ఎంసీకి వచ్చిన మొత్తం కాల్స్ 93 కాగా, అందులో 25 ఇవే. ఇప్పటి వరకు కోవిడ్‌కు సంబంధించి వచ్చిన మొత్తం కాల్స్ 2080.
24 గంటలు.. మూడు షిఫ్టులు..
గ్రేటర్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల పరిస్థితి.. పెరుగుతున్న తీరు.. ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి తదితరమైనవి తెలుసుకునేందుకు, బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మార్చి 22న కోవిడ్–19 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో పాజిటివ్ కేసులున్న వారిని తక్షణం ఆస్పత్రులకు తరలించేందుకు అవసరమైన అంబులెన్సులను పంపించేందుకు, కంటైన్మెంట్ జోన్లలోని వారి అవసరాలు తెలుసుకునేందుకు, లాక్‌డౌన్‌లో ఆపత్కాలంలో అవసరమైన వారికి ఆహారం అందించేందుకు, వలస కార్మికులకు అవసరమైన సహాయం, తదితరాల కోసం కంట్రోల్ రూమ్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి ఉద్యోగులను కంట్రోల్ రూమ్ విధుల్లో నియమించారు. ఏ విభాగానికి సంబంధించిన అవసరం వస్తే ఆ విభాగం తక్షణం స్పందించేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేశారు. ఇందులో జీహెచ్‌ఎంసీతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ, రెవెన్యూ, పౌర సరఫరాలు తదితర విభాగాల ఉద్యోగులు మూడు షిఫ్టులుగా 24 గంటల పాటు పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment