సాక్షి, మాదాపూర్: హైదరాబాద్‌లో అక్రమంగా నిర్మించిన కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలుచోట్ల అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా.. తాజాగా కావూరి హిల్స్‌లో నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది.
హైడ్రా అధికారులు, పోలీసులు.. సోమవారం ఉదయమే కావూరి హిల్స్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో కావూరి హిల్స్‌లో పార్క్‌ను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. పార్క్ స్థలంలో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణంపై కావూరి హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో అక్రమ షెడ్లను కూల్చేశారు. ఈ అక్రమ నిర్మాణాలను తొలగించి కావూరిహిల్స్ పార్కు పేరిట బోర్డును ఏర్పాటు చేశారు. అయితే, పార్కు స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. గడువు తీరకముందే అన్యాయంగా నిర్మాణాలు తొలగించారని ఆరోపించారు.
ఈ క్రమంలో ఇప్పటికే నిర్వాహకులకు తాము నోటీసులు ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అధికారుల నోటీసులను జిమ్ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో తాజాగా కూల్చివేతలు ప్రారంభించినట్టు చెప్పారు. కోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్టు హైడ్రా అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. శనివారం కూకట్‌పలిల్లోని నల్లచెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. నల్ల చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో దాదాపు 45 మంది స్థానికులకు పట్టా భూమి ఉంది. నిబంధనల ప్రకారం ఈ భూమిని కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే వినియోగించుకోవాలి. దీనికి విరుద్ధంగా కొందురు యజమానులు తమ భూమిని లీజుకు ఇచ్చారు. దీన్ని లీజుకు తీసుకున్న వ్యక్తులు అందులో 17 షెడ్లను తమ సొంత ఖర్చులతో నిర్మించుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రతి దఫా చెల్లించే లీజు మొత్తం నుంచి కొంత షెడ్ల నిమిత్తం మినహాయించుకుంటున్నారు.
ఇక, ఈ నిర్మాణాలు అక్రమమని గుర్తించిన ఇరిగేషన్, హైడ్రా అధికారులు 15 రోజు క్రితం నోటీసులు జారీ చేశారు. నిబంధనలను అనుసరించిన పట్టాదారులకే వీటిని ఇచ్చారు. అయితే నోటీసులు వచ్చిన విషయం దాచిన యజమానులు లీజు దారులను తప్పుదోవ పట్టించారు. ఆదివారం ఇరిగేషన్, హైడ్రా అధికారులు అక్కడి అక్రమ నిర్మాణాల్లో 16 కూల్చివేశారు. నోటీసుల విషయం తెలియని లీజు దారులు తమ యంత్రాలను, ఇతర వస్తువులను కూడా పూర్తిస్థాయిలో బయటకు తీసుకోలేకపోవడంతో అవి ధ్వంసమయ్యాయి. ఇరిగేషన్ అధికారులు తమకు సమాచారం ఇస్తే తామే సామాగ్రిని తీసుకొని వెళ్లిపోయేవారమని బాధితులు బోరున విలపించారు. కనీసం గంట సమయాన్ని కూడా ఇవ్వకుండా షెడ్లను నేలమట్టం చేయటం ఏమిటని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: సిట్టింగ్ జడ్జితో విచారణ: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment