సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని జలవనరుల్ని ఆక్రమించిన వారిలో బిల్డర్లే అత్యధికంగా ఉన్నట్లు హైడ్రా అధికారులు అనుమానిస్తున్నారు. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్లను కబ్జా చేస్తున్న వీళ్లు వాటిలో ఇళ్లు కట్టేందుకు అవసరమైన అనుమతులు తీసుకోవడానికి బోగస్ సర్వే నెంబర్లు వాడుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. సమీపంలో ఉన్న సాధారణ పట్టా భూమి సర్వే నెంబర్లు ఎఫ్‌టీఎల్‌కి సంబంధించినవి అన్నట్లు నమ్మించి కథ నడిపిస్తున్నారు. ఈ విషయాలు తెలియక ఆ ఇళ్లు, ప్లాట్, ఫ్లాట్స్‌ను ఖరీదు చేస్తున్న సామాన్యులు మోసపోవడంతో పాటు ప్రభుత్వం విభాగాలు చర్యలు తీసుకున్నప్పుడు సర్వం కోల్పోతున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కీలక నిర్ణయం తీసుకుంది.
ఇలా బిల్డర్ల చేతిలో మోసపోయిన బాధితులకు అండగా నిలవాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు. ఇటీవల వివాదాస్పదమైన పటేల్‌గూడ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి బుధవారం సోషల్‌మీడియాలో ఓ నెటిజనుడు లేవనెత్తిన అంశంపై రంగనాథ్ స్పందించారు. పలేట్‌గూడలో ఓ ఇంట్లో యజమాని గృహప్రవేశం చేసిన ఆరు రోజులకే హైడ్రా అధికారులు కూల్చేశారని, ఇప్పటికీ ఆ శిథిలాలు అలాగే ఉండటంతో దాని యజమాని నిత్యం వచ్చి చూసుకుని కుంగిపోతున్నట్లు ‘ఎక్స్’లోని సోషల్‌మీడియా ఛానల్‌లో ఉన్న పోస్టుపై వట్టెం రవికృష్ణ అనే నెటిజనుడు స్పందించారు.
‘నా ప్లాట్‌కి పరి్మషన్ తీసుకుని నీ ప్లాట్‌లో ఇల్లు కడితే చూస్తూ ఊరుకుంటావా? ఇక్కడ జరిగిందీ అదే. అప్రూవల్ తీసుకున్నది, రిజి్రస్టేషన్ చేసింది, కోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకున్నది పటేల్‌గూడలోని సర్వే నెం.6లో ఉన్న భూమికి. కానీ నిర్మాణాలు చేపట్టింది మాత్రం సర్వే నెం.12లోని భూమిలో. సర్వే నెం.12ను సర్వే నెం.6గా నమ్మించి, మోసం చేసిన బిల్డర్‌ని డబ్బు అడగాలి. అక్కడ శి«థిలాలు తొలగించకపోవడానికి హైకోర్టు ఇచి్చన స్టే ఆర్డర్ కారణం’ అంటూ వ్యాఖ్యను పోస్టు చేస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘పటేల్‌గూడ సర్వే నెం.12లో నిర్మాణాలకు అనుమతి ఇచి్చన పంచాయతీ సెక్రటరీ చాలా రోజుల క్రితమే సస్పెండ్ అయ్యారు. ఇలాంటి మోసాలు చేసిన బిల్డర్లను అరెస్టు చేయడంతో పాటు ప్రాసిక్యూట్ చేయాలి. అతడి ఆస్తులను ఎటాచ్ చేయాల్సిందే. ఇలాంటి బిల్డర్ల చేతిలో మోసపోయిన సామాన్యులు ఎవరైనా స్థానిక పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేస్తే..వారికి హైడ్రా అండగా ఉంటుంది. అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది’ అని ప్రకటించారు.
హైడ్రాకు పవర్!
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీకి ఉన్న రోడ్లు, డ్రెయిన్లు, జలవనరులు, ఖాళీ ప్రదేశాలు, పబ్లిక్ పార్కులు, పబ్లిక్ స్ట్రీట్స్ తదితరమైన వాటి రక్షణ బాధ్యతను ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్‌కు అప్పగించింది. జీహెచ్‌ఎంసీ యాక్ట్‌లోని సెక్షన్ 374బి మేరకు ఈ అధికారాలను బదలాయించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమేరకు మునిసిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ ఉత్తర్వు జారీ చేశారు. హైడ్రాకు ఈ అధికారాలు అప్పగించేందుకే జీహెచ్‌ఎంసీ యాక్ట్ –1955లో 374 బి సెక్షన్‌ను ఇటీవల కొత్తగా చేర్చగా, సంబంధిత ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడం తెలిసిందే.
దీంతో విపత్తు నిర్వహణ పనులతో పాటు జీహెచ్‌ఎంసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తుల పరిరక్షణ బాధ్యతల్ని కూడా హైడ్రా నిర్వహిస్తుంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు వృత్తిపర నైపుణ్యమున్న ప్రత్యేక ఏజెన్సీఅవసరమని భావించిన ప్రభుత్వం హైడ్రాకు జీహెచ్‌ఎంసీకున్న అధికారాలను బదలాయించింది. దేశంలోని అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్లలో ఒకటైన హైదరాబాద్‌లో లంగ్‌స్పేసెస్‌గా ఉన్న పార్కులు, సరస్సులు తదితరమైనవి కబ్జాల పాలు కాకుండా కాపాడుకోవాల్సిన అవసరమున్నందున ప్రత్యేక ఏజెన్సీ అవసరమని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విపత్తు నిర్వహణకు కూడా సహాయకంగా ఉంటుందని పేర్కొంది. రెండు బాధ్యతలు హైడ్రా నిర్వహిస్తుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment