ఎటువంటి అడ్డంకుల్లేకుండా లబ్ధిదారులకు నిధుల జమ
నాలుగేళ్లలో 20 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తాం
తొలి దశలో రేషన్‌కార్డు లేకున్నా అర్హులకు మంజూరు
రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి వెల్లడి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇందిరమ్మ ఇళ్లు కట్టుకొనే వారికి ఆర్థిక సమస్యలు రాకుండా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తమ ప్రభుత్వం గ్రీన్‌చానల్ రూపొందించిందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఖమ్మంలోని దానవాయిగూడెంలో పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విభాగాలు, శాఖల మధ్య సాంకేతిక అడ్డంకులు లేదా ఆర్థికపరమైన చిక్కులు తలెత్తకుండా గ్రీన్ చానల్ విధానం ద్వారా లబ్ధిదారులకు నిధులు చెల్లిస్తామన్నారు.
పునాదుల సమయాన రూ. లక్ష, లింటెల్ లెవల్ పూర్తి కాగానే రూ. 1.20 లక్షలు, స్లాబ్ వేశాక రూ. 1.75 లక్షలు, గృహప్రవేశంకన్నా ముందు లేదా ఆ తర్వాత మిగిలిన సొమ్ము చెల్లిస్తామని చెప్పారు. ఇదంతా గ్రీన్‌చానల్ విధానంలో ఆటంకాలు లేకుండా పూర్తవుతుందన్నారు. తొలిదశలో రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించామని.. త్వరలో రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ మొదలుకానుండగా రెండో విడత నుంచి రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లు పొందేందుకు అర్హులవుతారని తెలిపారు.
వై.ఎస్. హయాంలో తెలంగాణలో 19.56 లక్షల ఇళ్లు..
ఇందిరమ్మ ఇళ్లు అంటేనే కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని పొంగులేటి తెలిపారు. నాటి ఉమ్మడి ఏపీ పరిధిలోకి వచ్చే నేటి తెలంగాణలో 19.56 లక్షల ఇళ్లను దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కేటాయించారని గుర్తు చేశారు. ఇప్పుడు తహసీల్దార్ లేదా ఎంపీడీఓ గుర్తించాక కలెక్టర్ ద్వారా ఇన్‌చార్జి మంత్రి ఆమోదిస్తారని తెలిపా రు. మహిళల పేరుతో 400 చదరపు అడుగుల్లో ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాబోయే 2, 3 రోజుల్లోనే గ్రామసభల ద్వారా అర్హులను గుర్తిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఇళ్ల నిర్మాణంలో సాంకేతికత కోసం యాప్ రూపొందించామని, లబ్ధిదారులను ఇళ్ల వద్దకు తీసుకెళ్లి వివరాలు అప్‌లోడ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు పురోగతి తెలుస్తుందన్నారు. భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వ సాయం కూడా తీసుకొనేందుకు ప్రయతి్నస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ సొంతూరు చింతమడకతో సహా గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో నిలిచిపోయిన సుమారు 63 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను కూడా నిర్మించి పేదలకు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు పొంగులేటి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment