Is TS Inter Final Year Exams 2021 To Be Cancelled In Telangana? - Sakshi
Sakshi News home page

Telangana: ఇంటర్‌ ఫైనల్‌ పరీక్షలు రద్దు?!

Published Wed, Jun 2 2021 5:22 AM | Last Updated on Wed, Jun 2 2021 4:44 PM

Inter Final Exams To Be Canceled In Telangana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పబ్లిక్‌ పరీక్షల రద్దుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు సైతం రద్దు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇంటర్మీడియట్‌ అకడమిక్‌ కేలండర్‌ ప్రకారం వార్షిక పరీక్షలు మే నెల మొదటి వారంలో నిర్వహించాల్సి ఉంది. కానీ కోవిడ్‌–19 వ్యాప్తి నేపథ్యంలో ఈ పరీక్షలను బోర్డు వాయిదా వేసింది. తిరిగి జూలైæ రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సైతం ప్రతిపాదనలు సమర్పించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో జిల్లాల వారీగా ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించడం సరికాదని భావించిన కేంద్ర ప్రభుత్వం వాటి రద్దుకు ఆమోదం తెలిపింది. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జూలై రెండో వారం నుంచి నిర్వహించాలని భావించిన ఇంటర్‌ వార్షిక పరీక్షలపైనా సందిగ్ధత నెలకొంది. అయితే దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్షలను కేంద్రం రద్దు చేయడంతో.. రాష్ట్రంలో కూడా ఇదేతరహా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంటర్మీడియట్‌ బోర్డు వర్గాలు మాత్రం.. పరీక్షల నిర్వహణకు పక్కాగా చర్యలు చేపట్టినట్లు పేర్కొంటూనే ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవరిస్తామని చెబుతున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4,73,967 మంది విద్యార్థులు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. కోవిడ్‌ నేపథ్యంలో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలను బోర్డు ఇప్పటికే రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ఫస్టియర్‌ మార్కులే ఆధారం!
పరీక్షలు నిర్వహించే పక్షంలో విద్యార్థులు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఒకవేళ పరీక్షలు రద్దు చేస్తే మార్కులు ఎలా అనే అంశంపై కొంత గందరగోళం నెలకొంది. అయితే వీటిపై ఇప్పటికే అధికారులు ఓ ఆప్షన్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెకండియర్‌ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు గతేడాది ఫస్టియర్‌ పరీక్షలు రాశారు. ఈ నేపథ్యంలో ఆప్పుడు వచ్చిన మార్కుల ఆధారంగా సెకండియర్‌లో మార్కులు వేసే ఆప్షన్‌ను అధికారులు ఎంపిక చేశారు. ఒకవేళ పరీక్షలు రాయకుండా గైర్హాజరైన వారికి 45 శాతం మార్కులు వేసే అవకాశం ఉంది. ఫస్టియర్‌ పరీక్ష రాసి ఫెయిల్‌ అయిన విద్యార్థుల విషయంలో కూడా ఒక అంచనాకు వచ్చారు. పరీక్ష రాసి పాసైన సబ్జెక్టు మార్కుల ఆధారంగా సెకండియర్‌ మార్కులు నిర్ధారిస్తారు. ఫెయిల్‌ అయిన సబ్జెక్టుకు 45 శాతం మార్కులు వేస్తారు. ఇక ప్రాక్టికల్స్‌ విషయంలో రికార్డు ఆధారంగా మార్కులు నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement