రెండు గంటల పాటు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యేను ప్రశ్నించిన పోలీసులు
తిరుపతన్నకు ఇచ్చిన రెండు నంబర్లపైనే ప్రధాన దృష్టి
కుటుంబాల మధ్య వివాదం నేపథ్యంలో ఆ నంబర్లను ఇచ్చానన్న జైపాల్!
వారికి రాజకీయాలతో సంబంధం లేదని పోలీసులకు వివరణ
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలే బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను విచారించిన పోలీసులు.. శనివారం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్‌ను ప్రశ్నించారు.
ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న ఫోన్‌లో జైపాల్ యాదవ్‌కు సంబంధించిన లింకు దొరికిన నేపథ్యంలో.. ఆ ఆధారాలను జైపాల్ ముందుపెట్టి విచారించినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో సుమారు రెండు గంటల పాటు ప్రశ్నించి, వాంగ్మూలం నమోదు చేసుకున్నట్టు సమాచారం.
రెండు ఫోన్ నంబర్ల విషయంలో..
ప్రధానంగా తిరుపతన్నకు జైపాల్‌యాదవ్ ఇచ్చిన రెండు ఫోన్ నంబర్లపై విచారణ సాగినట్టు తెలిసింది. తమ కుటుంబానికి, మరో కుటుంబంతో వివాదాల నేపథ్యంలో అదనపు ఎస్పీ తిరుపతన్నను కలిశానని.. తిరుపతన్న తమ సామాజికవర్గం వ్యక్తికావడంతో వివాదం పరిష్కరించాలని కోరా నని జైపాల్‌యాదవ్ వెల్లడించినట్టు సమాచారం. తాను ఇచ్చిన రెండు ఫోన్ నంబర్లను తిరుపతన్న ట్యాప్ చేశారని.. అంతేతప్ప వారికి రాజకీయాలకు సంబంధం లేదని వివరించినట్టు తెలిసింది.
ఫోన్ల నుంచి రికవరీ చేసిన డేటా ఆధారంగా..
ఫోన్ ట్యాపింగ్‌పై కేసు నమోదుకు, పోలీసు అధికారుల అరెస్టుకు మధ్య కొంత సమయం వచ్చింది. ఆ సమయంలో తిరుపతన్న, మరికొందరు అధికారులు, మాజీ అధికారులు తమ ఫోన్లను ఫార్మాట్ చేయడం చేశారు. అయితే ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావుల అరెస్టు తర్వాత పోలీసులు వారి ఫోన్లు స్వాదీనం చేసుకుని.. చెరిపేసిన డేటాను వెలికితీయడానికి (రిట్రీవ్) వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
నిపుణులు డేటాను వెలికితీసి పోలీసులకు అందించారు. అందులో తిరుపతన్న ఫోన్ నుంచి రిట్రీవ్ చేసిన డేటాను విశ్లేషించిన నేపథ్యంలో.. ఆయనతో చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ సంప్రదింపులు జరిపినట్టు వెల్లడైంది. దీంతో పోలీసులు వారిని విచారణకు పిలిచి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment