ఆర్థిక విషయాలు దాచినా ఐటీకి సమాచారం అందుతుంది
మీ అడ్రస్, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ మారితే ఐటీ వెబ్‌సైట్‌లో విధిగా అప్‌డేట్ చేయాలి
అవగాహన సదస్సులో ఐటీ హైదరాబాద్ రేంజ్–5 అడిషనల్ కమిషనర్ సుమిత
సాక్షి, హైదరాబాద్: తప్పుడు క్లెయిమ్‌లు నమోదు చేసి ఆదాయపన్ను మినహాయింపులు పొందాలంటే భవిష్యత్తులో చిక్కులు తప్పవని ఇన్‌కమ్ ట్యాక్స్ హైదరాబాద్ రేంజ్–5 అడిషనల్ కమిషనర్ పి.సుమిత హెచ్చరించారు. ఆదాయపు పన్ను సకాలంలో చెల్లింపు, మినహాయింపు మార్గాలు, జత చేయాల్సిన ధ్రువపత్రాలు, అవకతవకలకు పాల్పడితే విధించే జరిమానాలు తదితర అంశాలపై ఆదాయ పు పన్ను శాఖ అధ్వర్యంలో మంగళవారం బంజారాహిల్స్‌లోని లారస్ ల్యాబ్స్ కార్యాలయంలో అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. సంస్థ ఉద్యోగులకు అడిషనల్ కమిషనర్ సుమిత, చార్టెడ్ అకౌంటెంట్ ఎన్.రామకృష్ణ శాస్త్రి పలు అంశాలను వివ రించారు.
ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో గతే డాది నుంచి ప్రత్యేక అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు సుమిత తెలిపారు. పన్ను చెల్లింపుదారులు తమ అడ్రస్, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ ఐడీలను ఇన్‌కమ్ ట్యాక్స్ ఇండియా/ఈ–ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా అడ్రస్, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ మారితే విధిగా అప్‌డేట్ చేయాలని సూచించారు. పన్ను ఎగవేసేందుకు ఆదాయ వివరాలు దాచిపెట్టినా.. సబ్ రిజి్రస్టార్ కార్యాలయాలు, ఆర్టీఏ కార్యాలయాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, కెడ్రిట్/డెబిట్ కార్డులు, వాహనాలు కొనుగోలు ఇలా అన్ని రకాలుగా ఐటీ అధికారులకు సమాచారం అందుతుందని స్పష్టం చేశారు. ఏవైనా తేడాలు ఉంటే పదేళ్ల తర్వాత కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. పన్ను చెల్లింపుదారులు సాధారణంగా చేస్తున్న పొరపాట్లు తదితర అంశాలపై ఎన్.రామకృష్ణ శాస్త్రి సూచనలు చేశారు. ఐటీ శాఖ నుంచి వచ్చే నోటీసులకు విధిగా స్పందించాలని, సకాలంలో స్పందించకపోతే పెద్ద మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఆధార్ కార్డును పాన్ నంబర్‌తో లింక్ చేయకపోతే అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుందని, అర్హతలేని రిటర్న్‌లు క్లెయిమ్ చేయొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్‌కమ్ ట్యాక్స్ హైదరాబాద్ సర్కిల్–5 అసిస్టెంట్ కమిషనర్ జి.శ్రీనివాస్, లారస్ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) సీహెచ్ సీతా రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment