సాక్షి, భూపాలపల్లి: కాళేశ్వరం ఎస్‌ఐ భవానీ సేన్‌పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఎస్‌ఐను డిస్మిస్ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్‌ఐ భవానీ సేన్ ను సర్వీస్ నుంచి ప్రభుత్వం తొలగించింది. భవానీ సేన్ వేధింపులపై మహిళా కానిస్టేబుల్.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మహిళా కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ భవానీ సేన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి రెండు సార్లు లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు తెలిపింది.
కాగా, ఇతని వ్యవహారశైలిపై ‘సాక్షి’కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం ఇచ్చిన సర్వీస్ రివాల్వర్‌ను అడ్డుపెట్టుకుని రాసలీలలు చేయడంలో తనకు తనే సాటి. గతంలో పనిచేసిన మంచిర్యాల జిల్లాలో ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించి సస్పెండ్ అయిన ఘన చరిత్ర ఆయనది. తన దగ్గర పనిచేసే మహిళా సిబ్బందిని డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో ఇబ్బందికి గురిచేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ‘నేను అందంగా లేనా... నన్ను వద్దంటావా...? కారణం చెప్పవా.. అనే మాటలు ఆయన దగ్గర పనిచేసే మహిళా సిబ్బంది, ఫిర్యాదుదారులు ఒక్కసారైనా ఎదుర్కోవాల్సిందే. అవసరం లేకున్నా రాత్రి వరకు మహిళా సిబ్బందిని స్టేషన్‌లో ఉంచుకుని హింసపెట్టడం తన దినచర్యలో భాగం
ఆయన నోట తరచూ వినిపించే పదం నేను మంత్రి మనిషిని.. నాకేం కాదు. ఇది చెప్పుకుంటూ పై అధికారులను మొదలుకొని కింది సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతగాని బెదిరింపులు భరించలేక ఆ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఏఎస్సై, ఓ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ బదిలీ చేసుకుని వెళ్లినట్లు సమాచారం. చోటామోటా నాయకులు స్టేషన్‌కు వస్తే చాలు... అందరికి వినిపించేలా ‘బాబన్న బాగుండా.. నాకు ఇంతకుముందే ఫోన్ చేసిండు’ అంటూ తనకు తానే డప్పు కొట్టుకోవడం కనిపిస్తుంటుంది.
ఆ జిల్లాకు చెందిన ఓ మంత్రి పేరుతో పోలీస్ అధికారులను, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్న రాసలీలల ఘనుడి విషయం ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంతో... తన కామవాంఛలను పనిచేసిన ప్రతీచోట మహిళా సిబ్బందిపై తీర్చుకుంటూ పోతున్నాడు. ఇలాంటి ఖాకీచకులపై పోలీస్‌శాఖ చర్యలు తీసుకోకుంటే మహిళలు ఆ శాఖకు రావాలంటేనే భయపడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో దృష్టి పెడితే ఇలాంటి ఘనుల బాగోతం వెలుగు చూసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment