సాక్షి, హైదరాబాద్: అమెరికాలో జరగనున్న ప్రపంచ పర్యావరణ, జల వనరుల సదస్సు (వరల్డ్ ఎన్విరాన్‌మెంటల్, వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్)లో.. జలాల విషయంలో తెలంగాణ సాధించిన విజయాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వివరించనున్నారు. అమెరికాలోని నెవడా రాష్ట్రం హెండర్సన్ నగరంలో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ఎఎస్‌సీఈ) ఈ సదస్సును నిర్వహిస్తోంది.
అందులో కేటీఆర్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం, ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న మిషన్ భగీరథ పథకాల ఫలితాలను ఈ సందర్భంగా వివరించనున్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఆహా్వనం మేరకు ఈ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ మంగళవారమే అమెరికాకు వెళ్లారు. మొత్తంగా సుమారు పది రోజుల పర్యటన తర్వాత ఈ నెల 25న కేటీఆర్ తిరిగి రాష్ట్రానికి వస్తారని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
అప్పట్లో ప్రణాళికలు.. ఇప్పుడు విజయాలు
మంత్రి కేటీఆర్ 2017లోనే అమెరికాలోని సాక్రమెంటో వేదికగా జరిగిన ఎఎస్‌సీఈ సదస్సులో పాల్గొని సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలు, చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి, మిషన్ భగీరథ తదితరాలను వివరించారు. 2022లో తెలంగాణలో పర్యటించిన ఎఎస్‌సీఈ బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. ఆ ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి రంగంలో గేమ్ చేంజర్‌గా అభివరి్ణంచింది. అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును స్వల్ప సమయంలో పూర్తి చేయడాన్ని ప్రశంసిస్తూ.. జల విజయాన్ని వివరించేందుకు అమెరికా రావాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది.
అమెరికా నలుమూలల నుంచి సివిల్ ఇంజనీర్లు పాల్గొనే ఈ సదస్సులో కేటీఆర్ ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ద్వారా తెలంగాణ సాధించిన సామాజిక, ఆర్థిక ప్రగతిని వివరిస్తారు. ఇక అమెరికా పర్యటనలో భాగంగా ఐదు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో వివిధ రంగాల కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను వివరిస్తారు. ఈ సందర్భంగా పలు అమెరికన్ దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించిన ప్రకటనలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి.
ఇది కూడా చదవండి: రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ
Comments
Please login to add a commentAdd a comment