ప్రతీకాత్మక చిత్రం
గద్వాల రూరల్: ‘నీకెంత ధైర్యం.. నా మనుషులపైనే కేసులు పెట్టి బైండోవర్ చేస్తావా.. అంటూ గద్వాలలో కల్లు కం లిక్కర్ మాఫియా పేట్రేగిపోతుంది.. అనధికార కల్లు దుకాణాలు నడిపిస్తూ అమాయక ప్రజల రక్తాన్ని పీల్చి జేబులు నింపుకొంటున్న కల్లు కం లిక్కర్ మాఫియా లీడర్ బుధవారం ఏకంగా ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వెళ్లి అధికారికి వార్నింగ్ ఇచ్చి దాదాగిరి చేయడం జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. గద్వాలలో అక్రమంగా కల్లు వ్యాపారం చేస్తూ.. కల్లు మాఫియా లీడర్‌గా పేరుగాంచిన సివిల్ సప్లయ్ బియ్యం కాంట్రాక్టర్ ఇటీవల లిక్కర్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తన అక్రమ వ్యాపారాలకు అధికారం కూడా తోడవడంతో అక్రమ దందా మూడు కల్లు సీసాలు.. ఆరు బీర్లుగా సాగుతోంది. అయితే గద్వాల పట్టణ శివారులోని అయిజ రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న ఓ వైన్‌షాపు సదరు కల్లు మాఫియా లీడర్ కనుసన్నల్లో కొనసాగుతుంది. అదే ప్రాంతంలో తన మార్కెట్‌ను పెంచుకునేందుకు ఎలాంటి అనుమతి లేకుండా మాంసం దుకాణాలు ఏర్పాటు చేయించి అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ మాదిరి లిక్కర్ దందా కొనసాగిస్తున్నాడు.
నిబంధనలకు నీళ్లు..
వాస్తవానికి ప్రభుత్వం అనుమతులిచ్చిన వైన్‌షాపుల వద్ద లిక్కర్‌ను మాత్రమే కొనుగోలుదారునికి విక్రయించాలి. అక్కడ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ వంటివి విక్రయించరాదని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఇక్కడ మాత్రం అక్రమ దందాకు అలవాటు పడిన సదరు లీడర్ ఎలాంటి అనుమతులు లేకుండానే సుమారు 10కిపైగా మాంసం, స్నాక్స్ దుకాణాలను తన మనుషులతో ఏర్పాటు చేయించి దర్జాగా అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నాడు.
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు అనుమతులు లేకుండా కొనసాగిస్తున్న మాంసం, స్నాక్స్ దుకాణాలను తొలగించాలని, లేదంటే చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని మొదటి హెచ్చరికగా సదరు వ్యాపారులకు స్పష్టం చేశారు. దీంతో అక్రమంగా వ్యాపారం చేసుకుంటున్న సదరు వ్యాపారులు తమ లీడర్‌ను ఆశ్రయించారు. దీంతో రెచ్చిపోయిన సదరు కల్లు లీడర్ తన అనుచర వర్గంతో కలిసి బుధవారం ఏకంగా గద్వాలలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వెళ్లారు.
అక్కడ డ్యూటీలో ఉన్న ఓ అధికారిపై జులుం ప్రదర్శించారు. నేనెవరో నీకు తెలుసు కదా.. నా దందాకే అడ్డు చెబుతావా.. మా వాళ్లను బెదిరిస్తావా.. నీకెంత ధైర్యం.. నీఅంతు చూస్తా..? నేను తలుచుకుంటే చిటికెలో నిన్ను ట్రాన్స్‌ఫర్ చేయిస్తా.. తమాషా చేస్తున్నావా.. నావెనక సర్కారే ఉంది.. జాగ్రత్త అంటూ దాదాగిరి చేశారు. ఈ విషయం కాస్త బయటికి పొక్కి టీవీల్లో ప్రసారమై.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వ అధికారికే భద్రత కరువైతే.. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటని పట్టణవాసులు విమర్శిస్తున్నారు.
నాపై దాడి చేయలేదు
ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై సదరు కార్యాలయ అధికారిని వివరణ కోరగా సదరు వ్యక్తి వచ్చిన మాట వాస్తవమే.. మా వాళ్లే దుకాణాలను పెట్టుకుని బతుకుతున్నారు.. మీరు బైండోవర్ చేస్తామని చెప్పారంటా అని నాతో కొద్దిగా గట్టిగా అడిగారు. అంతేకాని నాపై ఎలాంటి దాడి చేయలేదు. బయట న్యూస్ టీవీలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో మాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment