పత్రాలు మార్చి..జనాన్ని ఏమార్చి.. | Mahabubnagar Gang Held for Forgery and Selling Vacant Lands | Sakshi
Sakshi News home page

పత్రాలు మార్చి..జనాన్ని ఏమార్చి..

Published Thu, Apr 28 2022 3:13 AM | Last Updated on Thu, Apr 28 2022 8:33 AM

Mahabubnagar Gang Held for Forgery and Selling Vacant Lands - Sakshi

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొన్నాళ్లుగా సాగుతున్న భూమాఫియా అక్రమాలకు ఇదో ఉదాహరణ. అమాయకులు, స్థానికంగా లేనివారి, వివాదాలున్న స్థలాలను గుర్తించడం.. నకిలీ ఆధార్‌కార్డులు, తప్పుడు వ్యక్తులను చూపించి, ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు చేయిస్తూ.. స్థలాలను కాజేయడం విచ్చలవిడిగా సాగుతోంది. కొందరు రియల్టర్లు, రాజకీయ నాయకులు, అడ్వొకేట్లు, అధికారులు కుమ్మక్కై ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. బాధితులు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినా లాభం ఉండటంలేదని వాపోతున్నారు. భూములపై ఆశలు వదిలేసుకోవాలని, లేకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొంటున్నారు.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో భూమాఫియా ఆగడాలు మరింతగా పెరుగుతున్నాయి. గతంలో మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం కొత్తపల్లిలో నకిలీ ఆధార్‌కార్డులు, వ్యక్తులతో గుట్టుచప్పుడు కాకుండా భూములను కాజేసిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సదరు నిందితులపై కఠిన చర్యలేమీ తీసుకోకపోవడంతో భూమాఫియా మరింతగా    రెచ్చిపోతోందని.. నారాయణపేట జిల్లాలో అదే తరహా అక్రమాలకు పాల్పడిందని స్థానికులు చెప్తున్నారు. ఈ తప్పుడు రిజిస్ట్రేషన్లపై బాధితులు ఫిర్యాదులు చేస్తుండటంతో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ భూమి వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్‌ అయినట్టు అసలు యజమానులు గుర్తించేలోగా అక్రమార్కులు అన్నీ చక్కబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో వి విధ శాఖల అధికారులను మేనేజ్‌ చేస్తున్నట్లు సమాచారం. డబ్బు, రాజకీయ పలుకుబడితో అసలు యజమానులను బెదిరించి తప్పుకునేలా చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.

సరిహద్దుల్లోని భూములే టార్గెట్‌..
అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని జడ్చర్ల కేంద్రంగా ఓ భూ మాఫియా ముఠా తెరపైకి తీసుకొచ్చిందని.. తర్వాత ఈ ముఠా కార్యకలాపాలు మహబూబ్‌నగర్‌తోపాటు రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు విస్తరించాయని బాధితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏపీ, కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోని భూములను, ముఖ్యంగా స్థానికంగా ఉండని వారి భూములను లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. ఈ ముఠా పలువురు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులు, సిబ్బంది సహకారంతో గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్‌ తంతు ముగిస్తోందని తెలిసింది. నారాయణపేట జిల్లాలో ఈ ముఠాకు కృష్ణా మండలం హిందూపూర్‌కు చెందిన ఓ దళారి అన్నీ తానై సహకరిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ, అసైన్‌మెంట్, కోర్టు కేసుల్లో ఉన్న భూముల రికార్డులు ఆ దళారీ వద్ద ఉన్నాయని.. వాటి ఆధారంగానే అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు చెప్తున్నారు.

ఒకటొకటిగా వెలుగులోకి..
∙నారాయణపేట జిల్లా మాగనూరు మండలం ఉజ్జెల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టా భూమిని ఇతరులకు అమ్మినట్టు భూమాఫియా రికార్డులు సృష్టించింది. దాదాపు వందేళ్లుగా సాగు చేసుకుంటున్న సదరు కుటుంబానికి తెలియకుండా.. ఇతరుల పేర్లపై భూమి రిజిస్ట్రేషన్‌ కావడం విస్మయం కలిగిస్తోంది.

∙గద్వాల జిల్లా అలంపూర్‌ చౌరస్తాలో గతంలో కొనుగోలు చేసి ఖాళీగా ఉంచిన భూములపై భూమాఫియా ముఠా కన్నేసింది. జాతీయ రహదారికి ఆనుకుని ఉ న్న భూముల వివరాలు సేకరించిన అక్రమార్కులు.. స్థానికంగా లేని వారిని గుర్తించి, వారిని పోలిన పేర్లతో ఉన్నవారితో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయిం చుకున్నట్టు సమాచారం. వేర్వేరు చోట్ల సుమారు 12 ఎకరాల భూమి నలుగురి పేరిట చేతులు మారినట్టు తెలిసింది.

∙మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం మసిగండ్ల శివారులో నార్య పేరు మీద సర్వే నంబర్‌ 180లో మూడెకరాల భూమి ఉంది. కొన్నేళ్ల కిందే ఆయన చనిపోయారు. కానీ మూడు నెలల క్రితం కొందరు ఆయన పేరుతోనే ఉన్న మరో వ్యక్తిని తీసుకొచ్చి ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ప్రయత్నించారు. ఆ వ్యవహారంలో ç రూ.30 లక్షల వరకు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. అధికారులు ఆ రిజిస్ట్రేషన్‌ను పెండింగ్‌లో పెట్టినా.. పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడెబల్లూరుకి చెందిన దళిత రైతు కర్కు వెంకమ్మ (భర్త కర్కు బస్వరాజ్‌)కు మాగనూరు మండలం లక్ష్మీపూర్‌ గ్రామశివారులో మూడు సర్వే నంబర్ల పరిధిలో దాదాపు ఐదెకరాల భూమి ఉంది. ఆ భూమిపై కన్నేసిన ముఠా.. 2020లో సర్వే నంబర్‌ 55/ఈ/1లోని 2.38 ఎకరాలు, సర్వే నంబర్‌ 56/ఈలోని 2 ఎకరాలు కలిపి 4.38 ఎకరాల భూమిని కాజేసింది. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గ పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన ఓ అంగన్‌ వాడీ టీచర్‌ను భూయజమానిగా, నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం మల్లెపల్లికి చెందిన లింగప్పను కొనుగోలుదారుగా సృష్టించింది. నకిలీ ఆధార్‌కార్డులను తయారు చేసి, ఫోర్జరీ సంతకాలు, వేలిముద్రలతో రిజిస్ట్రేషన్‌ చేయించేసింది. సర్వే నంబర్‌ 55/ఈ/2/1లో ఉన్న ఒక గుంట భూమి మాత్రమే వెంకమ్మ పేరిట మిగిలింది. అయితే ఇటీవల తమకు రైతుబంధు డబ్బులు రాకపోవడంతో.. వెంకమ్మ 2021 జూన్‌ 26న మాగనూరు తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి ఆరా తీసింది. రికార్డులను పరిశీలించిన తహసీల్దార్‌.. భూమిని అమ్మేశాక రైతుబంధు ఎలా వస్తుందనడంతో హతాశురాలైంది.

పాములతో కరిపిస్తామని బెదిరిస్తున్నారు
మక్తల్‌కు చెందిన ఓ అడ్వొకేటు, ఓ ప్రజాసంఘం నాయకుడు, ఇద్దరు రాజకీయ నాయకులు కలిసి మా భూమిని మాకు కాకుండా చేశారు. నా పేరు మీద ఉన్న భూమిని అక్రమంగా లింగప్ప పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఇదేమిటని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నరు. ఆఫ్రికా కోబ్రాలను తీసుకొచ్చి మమ్మల్ని కరిపిస్తమని భయపెడుతున్నరు. వెంటనే కలెక్టర్‌ పట్టించుకుని లింగప్ప పేరుతో ఇచ్చిన పట్టాదారు పాసుబుక్‌ రద్దు చేయాలి. మాకు న్యాయం చేయాలి.– కర్కు వెంకమ్మ–బస్వరాజ్, బాధిత రైతు దంపతులు, గుడెబల్లూరు, కృష్ణా, నారాయణపేట 


నన్ను కొట్టి.. పంట నాశనం చేశారు..
మాకున్న 11 ఎకరాల్లో 3 ఎకరాల భూమిని ఏడాది క్రితం నాకు తెలియకుండానే రిజిస్ట్రేషన్‌ చేయించేసుకున్నారు. అప్పటి తహసీల్దార్‌కు డబ్బులిచ్చి పట్టా చేసుకున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లిన. ఇంకా తీర్పు రాలేదు. ఇటీవల నా పొలంలో వరి నాట్లు వేసుకుంటే.. కొందరు వచ్చి నన్ను కొట్టి, ట్రాక్టర్‌తో పంటను నాశనం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.  – కుర్వ బస్వరాజ్,    బాధిత రైతు, తంగిడి, కృష్ణా, నారాయణపేట 

చీటింగ్‌ కేసు నమోదైంది
లక్ష్మీపూర్‌లో కర్కు వెంకమ్మకు సంబంధించిన 4.38 ఎకరాల భూమిని నకిలీ పత్రాలు సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఘటన మా దృష్టికి వచ్చింది. సదరు భూయజమాని ఫిర్యాదుతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో దాసరి వెంకటమ్మ, లింగప్పలపై చీటింగ్‌ కేసు నమోదైంది.    
    – తిరుపతి, తహసీల్దార్, మాగనూర్‌ 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement