Measles And Rubella Cases Are Increasing In Telangana - Sakshi
Sakshi News home page

తెలంగాణను వణికిస్తున్న మీజిల్స్, రూబెల్లా కేసులు.. టెన్షన్‌ పెడుతున్న సర్వే రిపోర్టు!

Published Mon, Dec 19 2022 2:07 AM | Last Updated on Mon, Dec 19 2022 10:26 AM

Measles And Rubella Cases Are Increasing In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో రూబెల్లా, మీజిల్స్‌ కేసులు పెరుగుతున్నాయి. కరోనా సమయంలో సంబంధిత వ్యాక్సిన్‌ పూర్తిస్థాయిలో వేయకపోవడం వల్ల దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి చోటు చేసుకుందని, పిల్లలతో పాటు పెద్దల్లోనూ కేసులు పెరుగుతున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. 2021లో ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది పిల్లలు మీజిల్స్‌ వ్యాక్సిన్‌ వేసుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో మరణాలు కూడా సంభవించాయి. ఆ సంవత్సరం ప్రపంచంలో 90 లక్షల కేసులు నమోదు కాగా, ఏకంగా 1.28 లక్షల మంది చనిపోయారు. 

అలాగే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోనూ మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 13 మంది పిల్లలు మీజిల్స్‌ వ్యాధితో మరణించారు. గుజరాత్‌లో 9, జార్ఖండ్‌లో 8, బిహార్‌లో 7, హరియాణాలో ముగ్గురు చనిపోయారు. 2021లో ప్రపంచంలో 81 శాతం మంది పిల్లలు మొదటి డోసు వేసుకోగా, 71 శాతం పిల్లలు మాత్రమే రెండో డోసు మీజిల్స్, మంప్స్, రూబెల్లా (ఎంఎంఆర్‌) వ్యాక్సిన్‌ వేసుకున్నారు. 2008 తర్వాత ఇంత తక్కువగా వ్యాక్సిన్‌ తీసుకోవడం ఇదే మొదటిసారి. 2021లో ఈ విధంగా పూర్తిస్థాయిలో డోసులు తీసుకోకపోవడం వల్ల 2022లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.  

అన్ని జిల్లాల్లోనూ కేసులు..
తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ మీజిల్స్, రూబెల్లా కేసులు నమోదవుతున్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వైలెన్స్‌ ఇండికేటర్స్‌–2022లో కేసులను అంచనా వేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు వేసిన అంచనా ప్రకారం తెలంగాణలో 1,452 కేసులు నమోదయ్యాయి. అందులో లేబరేటరీలో నిర్ధారించిన మీజిల్స్‌ కేసులు 70 కాగా, రూబెల్లా కేసులు 36 ఉన్నాయి. అంచనా వేసిన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 208 మీజిల్స్, రూబెల్లా కేసులు రికార్డు అయ్యాయి. మేడ్చల్‌ మల్కాజిగిరిలో 144, రంగారెడ్డి 92, సంగారెడ్డి 89, వనపర్తి 69, నిజామాబాద్‌లో 67, వికారాబాద్‌ 66, నాగర్‌కర్నూలు 49, యాదాద్రి భువనగిరి 55, కరీంనగర్‌లో 40, హనుమకొండ 39, నల్లగొండ 38, మెదక్‌ 35, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 34 చొప్పున నమోదయ్యాయి. 

దద్దుర్లు వస్తే జాగ్రత్త పడాలి..
రూబెల్లాను జర్మన్‌ మీజిల్స్‌ లేదా త్రీ–డే మీజిల్స్‌ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. బాధితుల్లో సగం మందికి తమకు సోకిందని గుర్తించలేరు. శరీరంపై దద్దుర్లు బహిర్గతమైన రెండు వారాల తర్వాత లక్షణాలు ప్రారంభం అవుతాయి. మూడు రోజుల వరకు ఉంటాయి. ఇది సాధారణంగా ముఖం మీద మొదలై శరీరంలోని మిగిలిన భాగాలకు వ్యాపిస్తుంది. దద్దుర్లు కొన్నిసార్లు దురదగా ఉంటాయి. మీజిల్స్‌ లాగా పూర్తిస్థాయిలో కనిపించవు. కొన్ని వారాల పాటు కూడా ఉండవచ్చు. జ్వరం, గొంతు నొప్పి, అలసట ఉంటుంది. పెద్దవారిలో కీళ్ల నొప్పులు సాధారణం. సమస్యలలో రక్తస్రావం, మెదడువాపు, నరాల వాపు వంటివి ఉండవచ్చు. గర్భధారణ ప్రారంభ సమయంలో సంక్రమణ.. గర్భస్రావం లేదా రూబెల్లా సిండ్రోంతో కూడిన బిడ్డ జననాని ఇది దారితీయవచ్చు. పిల్లల వీపుపై రూబెల్లా కారణంగా దద్దుర్లు ఉంటాయి. అవి తక్కువ ఎరుపు రంగులో ఉంటాయి. రూబెల్లా వైరస్‌ ఇతరుల నుంచి గాలి ద్వారా వ్యాపిస్తుంది. రక్తం, గొంతు లేదా మూత్రంలో వైరస్‌ను యాంటీబాడీ పరీక్షలతో నిర్ధారించవచ్చు.

మీజిల్స్‌లో 104 డిగ్రీల వరకు జ్వరం 
మీజిల్స్‌ అనేది మీజిల్స్‌ వైరస్‌ వల్ల వచ్చే అంటువ్యాధి. సాధారణంగా వ్యాధి సోకిన వ్యక్తికి 10–12 రోజుల తర్వాత లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. 7–10 రోజుల వరకు ఉంటాయి. సాధారణంగా జ్వరం, తరచుగా 104 నిడిగ్రీల వరకు వస్తుంది. దగ్గు, ముక్కు కారడం, కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు ఉంటాయి.  ఎరుపు, చదునుగా ఉండే దద్దుర్లు సాధారణంగా ముఖం మీద మొదలై, మిగిలిన శరీరానికి వ్యాపిస్తాయి, సాధారణ సమస్యల్లో 8 శాతం కేసుల్లో అతిసారం, ఏడు శాతం మందిలో చెవి ఇన్ఫెక్షన్, ఆరు శాతం మందిలో న్యుమోనియా ఉంటాయి. కొన్ని కేసుల్లో మాత్రం మూర్ఛలు, అంధత్వం, మెదడు వాపు సంభవించే అవకాశం ఉండొచ్చు. దీన్ని తట్టు అని కూడా పిలుస్తారని నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి డాక్టర్‌ కిరణ్‌ మాదల పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement