ఆర్టీసీ బస్సు సర్వీసుల ప్రారంభానికి చర్యలు | Meeting Of RTC Officials Of Two Telugu States | Sakshi
Sakshi News home page

బస్సుకు రూట్‌ క్లియర్..‌!

Published Mon, Aug 24 2020 12:50 AM | Last Updated on Mon, Aug 24 2020 9:17 AM

Meeting Of RTC Officials Of Two Telugu States - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల ప్రారంభానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ వారంలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఏపీ అధికారులు బస్సు సర్వీసుల్ని ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉన్నారు. అన్‌లాక్‌ సీజన్‌లో భాగంగా బస్సు సర్వీసులకు కేంద్రం అనుమతి ఇవ్వగానే, రెండు రాష్ట్రాల మధ్య బస్సు సేవలను పునరుద్ధరించాలని ఏపీ అధికారులు భావించి, తెలంగాణ ఆర్టీసీ అధికారులకు లేఖ కూడా రాశారు. కానీ కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభించరాదని భావించింది. కేవలం రాష్ట్రంలో హైదరాబాద్‌ వెలుపల మాత్రమే ఆర్టీసీ బస్సులు తిప్పాలని  నిర్ణయించి జిల్లా సర్వీసులు ప్రారంభించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన సమీక్షలో భాగంగా, అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభించే అంశాన్ని అధికారులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ కొన్ని కీలక సూచనలు చేశారు.

అధికారులు ఏం చెప్పారంటే..
రాష్ట్రం విడిపోక ముందు ఉమ్మడి ఏపీఎస్‌ఆర్టీసీలో.. తెలం గాణ ప్రాంతంలో ఆంధ్ర పరిధిలోని డిపోల బస్సులు ఎక్కు వగా తిరిగేవి. అదే ఆంధ్రా పరిధిలో తెలంగాణ ప్రాంత డిపోల బస్సులు తక్కువగా తిరిగేవి. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. దీనివల్ల తెలంగాణ ఆర్టీసీకి నష్టం వస్తోందని ఇటీవల అధికారులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తెచ్చారు. లాక్‌డౌన్‌కు ముందునాటి లెక్కల ప్రకారం ప్రస్తుతం దాదాపు వెయ్యి ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ పరిధిలో తిరుగుతున్నాయి. టీఎస్‌ ఆర్టీసీకి చెందిన 750 బస్సులే ఏపీ పరిధిలో తిరుగు తున్నాయి. ఆంధ్రా బస్సులు తెలంగాణ భూభాగంలో రెండున్నర లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతుంటే, తెలంగాణ బస్సులు ఏపీలో లక్షన్నర కిలోమీటర్లు మాత్రమే తిరుగుతున్నాయి. దీనివల్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందంటూ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

కేసీఆర్‌ ఏం సూచించారంటే..
రెండు ఆర్టీసీలు సమంగా బస్సులను నడిపేలా, ఒకే పరిమాణంలో కిలోమీటర్ల మేర తిరిగేలా ఈ సమయంలోనే ఒప్పందం చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఏపీతో పాటు పొరుగునున్న మహారాష్ట్ర, కర్ణాటకలతో కూడా ఇలాంటి ఒప్పందం చేసుకోవాలన్నారు. ఆర్టీసీ విడిపోక ముందు ఈ తరహా ఒప్పందాలు పొరుగు రాష్ట్రాలతో ఏపీఎస్‌ఆర్టీసీ చేసుకుంది. ఫలితంగా ఆ ఒప్పందాలు ఇప్పుడు ఏపీకే పరిమితమయ్యాయి. కొత్తగా ఏర్పడ్డందున తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు అన్ని పొరుగు రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంది. సీఎం ఆదేశంతో ఓసారి తెలంగాణ ఆర్టీసీ అధికారులు విజయవాడ వెళ్లి ఏపీ అధికారుల సమావేశమైనా చర్చలు కొలిక్కి రాలేదు. హైదరాబాద్‌లో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. బస్‌భవన్‌లో కొందరు అధికారులు, సిబ్బందికి కరోనా సోకటంతో ఈ భేటీ రద్దయింది. తాజాగా ఈ వారంలో జరగనున్న భేటీలో చర్చలు కొలిక్కి వస్తే రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగి ప్రారంభమవుతాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement