రోటిబండ, పులిచర్లకుంట తండాల్లోనూ అదే ఉత్కంఠ
బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న గిరిజనులు
పరారీలో పలువురు అనుమానితులు.. ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న పోలీసులు
వైరల్‌గా మారిన నరేందర్‌రెడ్డి వీడియో
వికారాబాద్/ పరిగి: లగచర్ల ఘటనతో వికారాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది. రోటిబండతండా, పులిచర్లకుంటతండా, లగచర్ల గ్రామాల గిరిజనులు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. అధికారులపై దాడి ఘటన అనంతరం ఆయా గ్రామాలకు చెందిన చాలా మంది భయంతో ఊర్లు వదిలి పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం ఆఫ్ చేసిన మొబైల్ నెట్‌వర్క్ సేవలను గురువారం పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు.
తమవారు ఏమైపోయారో తెలియక..
లగచర్ల సహా ఫార్మా విలేజ్ ప్రభావిత గ్రామాల ప్రజల్లో కొందరు వారి పనులు చేసుకుంటుండగా.. పరారీలో ఉన్నవారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ వారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, పోలీసులకు దొరికిపోయారో ఏమీ తెలియక కన్నీళ్లు పెడుతున్నారు. ఇళ్లలో మగవారంతా వెళ్లిపోవడంతో.. వ్యవసాయ పనులు ఆగిపోయాయని, రెక్కాడితే కానీ పూట గడవని తమకు నిద్రాహారాలు కరువయ్యాయని వాపోతున్నారు. ఈ గ్రామాల్లో అధికారులపై దాడి ఘటన అంశంపై ఎవరిని పలకరించినా మాట్లాడేందుకు జంకుతున్నారు.
మాట్లాడితే పోలీసులు, అధికారులు తమ ను టార్గెట్ చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారులపై దాడిని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నవారు గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మరోవైపు ఫార్మా విలేజీ భూసేకరణకు సంబంధించి ‘‘అధికారులను తరిమికొడదాం.. నేను, బీఆర్‌ఎస్ పార్టీ మీ వెంటే ఉంటాం. ఏం జరిగినా చూసుకుంటాం.. కేటీఆర్ కూడా మీకు అండగా ఉంటారు. భూములు జోలికి వస్తే దాడులు చేయటానికి కూడా వెనకాడొద్దు’’అంటూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని గతంలో మాట్లాడిన వీడియో గురువారం వైరల్‌గా మారింది.
ఘటనపై ఏడీజీ సమీక్ష
లగచర్ల ఘటన, తర్వాతి పరిణామాలపై అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీ) మహేశ్ భగవత్ సమీక్షించారు. పరిగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన.. అక్కడ ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణరెడ్డి, డీఎస్పీలు కరుణాసాగర్, ఇతర పోలీసు అధికారులతో.. ఘటన పూర్వాపరాలపై చర్చించినట్టు తెలిసింది. 120 మంది వరకు దాడి ఘటనలో పాల్గొ న్నట్లు భావిస్తున్న పోలీసులు ఇప్పటికే 21 మందిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం జరుపుతున్న గాలింపు.. ఫార్మా విలేజీ ప్రభావి త గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించినట్టు సమాచారం. భవిష్యత్‌లో ఇలాంటివి చోటు చే సుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment