ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు
రేపు కేబినెట్ భేటీలో రైతు భరోసాతో పాటు సబ్ కమిటీ సిఫారసులకు ఆమోద ముద్ర
ఈ నెల 5 నుంచి 7 వరకు గ్రామసభల్లో దరఖాస్తుల స్వీకరణ!
పథకంపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి నుంచి అమలు చేయాలని భావిస్తున్న ‘రైతు భరోసా’కోసం రైతుల నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సూచించింది. గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీ మరోసారి సమావేశమై వివిధ అంశాలను చర్చించింది.
మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు సమావేశమై రైతు భరోసా విధివిధానాలకు తుదిరూపు ఇచ్చారు. ఈ నెల 4న జరిగే మంత్రివర్గ సమావేశంలో ‘రైతు భరోసా’కు, కేబినెట్ కమిటీ సిఫారసులకు ఆమోదముద్ర వేయనున్నారు.
సెల్ఫ్ డిక్లరేషన్‌పై భిన్నాభిప్రాయాలు
ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు రైతు భరోసాపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఒక మండలాన్ని మూడు భాగాలుగా విభజించి ఆ మూడురోజుల్లోనే గ్రామ సభలు నిర్వహించి, రైతు భరోసా కోసం దరఖాస్తులు ఆహా్వనించాలనే అభిప్రాయానికి వచ్చారు. రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలన్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈ దరఖాస్తుల అంశాన్ని తెరపైకి తెచి్చనట్లు సమాచారం. ఇప్పటివరకు మంత్రులు చెప్పిన అభిప్రాయాలు, ప్రజల నుంచి వచ్చిన స్పందన, ముఖ్యమంత్రి సూచనలతో పూర్తిస్థాయి నివేదికను రూపొందించి శనివారం మంత్రివర్గ సమావేశం ముందుంచనున్నారు.
సాగుచేసే రైతులందరికీ భరోసా
రాష్ట్రంలో భూమి సాగు చేసే రైతులందరికీ తప్పనిసరిగా సాయం అందించాలనే నిర్ణయానికి సబ్ కమిటీ వచ్చినట్లు తెలిసింది. శాటిలైట్ మ్యాపింగ్, అధికారుల సర్వేకు అనుగుణంగా రైతు సాగు చేసే భూమిని ప్రతి సీజన్‌లో లెక్క కట్టే అంశాన్ని నిబంధనల్లో చేర్చాలని స్పష్టంగా పేర్కొనట్లు సమాచారం. ధరణి పోర్టల్ ప్రకారం రాష్ట్రంలో కోటీ 53 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, సాగుభూమి కోటీ 30 లక్షల ఎకరాలుగా ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది.
ఇందులో యాసంగిలో 70 లక్షల ఎకరాల వరకే వివిధ పంటలు సాగవుతాయి. ఈ పరిస్థితుల్లో సీలింగ్‌తో సంబంధం లేకుండా సాగుభూమి మొత్తానికి రైతు భరోసా అమలు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం. అలాగే భూగరిష్ట పరిమితిని పరిగణనలోకి తీసుకుంటే వచ్చే సమస్యలపై కూడా మరోసారి చర్చించినట్లు తెలిసింది. ఐటీ చెల్లింపుదారులను రైతు భరోసాకు అనర్హుల్ని చేసే ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’మార్గదర్శకాలను అమలు చేయకూడదని నిర్ణయించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment