ఏటూరునాగారం : కరోనాతో ప్రపంచమంతా గడగడలాడిపోతుంటే ఏటూరునాగారం మండల పరిధిలోని కోయగూడ ఎల్లాపురం పంచాయతీ పరిధిలోని లంబాడీతండా ప్రజలు మాత్రం ప్రశాంత జీవనం గడుపుతున్నారు. వారి చైతన్యమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. కట్టుబాట్లు, గ్రామ పెద్దలు తీసుకునే నిర్ణయాలను సమష్టిగా ఆచరిస్తూ.. కోవిడ్ మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని, చేతులు ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసుకోవాలని గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ గ్రామాల నుంచి బయటకి వెళ్లిన వారు ఇంటికి తిరిగి రాగానే వేడినీళ్లతో స్నానం చేయాలని నిర్ణయించారు. రోజూ వేడి చేసిన నీరు తాగుతూ.. వ్యక్తిగత శుభ్రత పాటించడంతో కరోనా తమ గ్రామానికి రాలేదని గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతున్నారు.
అన్ని కార్యక్రమాలకు దూరం
తండాలోని ప్రజలు ఎవరూ బయటికి వెళ్లకుండా ఉండడం.. తండాకు ఎవరినీ రానీయకుండా ఆపేయడం వంటి చర్యలతో కరోనా నియంత్రణలో ఉందని గ్రామస్తులు తెలిపారు. ఇక్కడి ప్రజలు మూడు దశాబ్దాలుగా పోడు వ్యవసాయంతో పాటు వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి, వేరుశనగ పండిస్తున్నారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో నిరంతరం ఇబ్బందులు పడుతుంటారు. అయినా చైతన్యంతో స్థానిక పరిస్థితులపై నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. కరోనా మొదటి వేవ్ ప్రారంభంలోనే ప్రజలంతా ఏకమై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు కావడంతో నిత్యావసర వస్తువులను పంటల ఆధారంగా ఒకేసారి నిల్వ చేసుకోవడం జరుగుతుంటుంది. ఒక వైపు జీడివాగు, మరోవైపు అటవీప్రాంతం కావడంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సెకండ్ వేవ్‌లో ఒక్క కేసు కూడా లేకపోవడం గమనార్హం.
సంపూర్ణ అవగాహనతోనే..
కరోనా నిబంధనలపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాం. గ్రామంలో 102 కుటుంబాలున్నాయి. గ్రామంలో బ్లీచింగ్, శానిటేషన్ పనులు చేయించాం. ట్రైబల్ ప్రాంతం కావడంతో సంపూర్ణ మద్దతులో అభివృద్ధి పనులు చేపట్టాం. పారిశుద్ధ్య పనులతోపాటు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. దోమల మందు పిచికారీ చేయించడం జరిగింది.
– లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి, కోయగూడ ఎల్లాపురం
సమష్టిగా నిర్ణయాలు..
గ్రామంలో అభివృద్ధి పనులకై సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం. కరోనా కట్టడికి మాస్క్‌లు, శానిటేషన్‌తోపాటు భౌతికదూరం పాటించే అలవాటు ఉంది. అన్ని కుటుంబాలు వ్యవసాయ పనుల పైనే దృష్టి పెట్టారు. రాత్రి అయితే గానీ ఎవరూ ఎవరికి కలవరు. ఉదయం నుంచి రాత్రి వరకు పొలాల వద్ద, అటవీ ప్రాంతాలకు పనుల నిమిత్తం పోతుంటారు. దాని వల్ల భౌతికదూరం ఏర్పడుతుంది.
– నగేష్, ఉప సర్పంచ్, కోయగూడ ఎల్లాపురం
Comments
Please login to add a commentAdd a comment