గొర్రెల పంపిణీ స్కాంలో నగదు లావాదేవీలపై దర్యాప్తునకు సిద్ధం
మేకలు, గొర్రెల అభివృద్ధి సంస్థ, ఏసీబీల నుంచి మరిన్ని వివరాలు కోరే యోచన
ఆ సమాచారాన్ని విశ్లేషించేందుకు ప్రత్యేక బృందాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కుంభకోణం కేసుపై సమగ్ర దర్యాప్తునకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా నగదు లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. గొర్రెల పంపిణీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు జరిగిన నిధుల లావాదేవీలు, గొర్రెల పంపిణీ, లబ్ధిదారుల వివరాలు, ఇతర పూర్తి సమాచారం ఇవ్వాలంటూ ఈడీ ఇప్పటికే తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహ కార సంస్థ ఎండీకి లేఖ రాసింది. దీనిని అత్యవసరంగా పరిగణించి వివరాలు ఇవ్వాలని కోరింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 54 కింద ఈడీ అధికారులు ఈ వివరాలను తీసుకోనున్నారు.
ఈడీ అధికారులు వస్తారనుకున్నా..
గొర్రెల పంపిణీ వ్యవహారం దర్యాప్తు కోసం ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం గొర్రె లు, మేకల సహకార అభివృద్ధి సంస్థకు రాను న్నట్టు ప్రచారం జరిగింది. ఈడీ అధికారులు వస్తున్నట్టు సంస్థ వర్గాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. కానీ కార్యాలయంలో సంస్థ ఎండీ, ఇతర ఉన్నతాధికారులెవరూ అందు బాటులో లేరని, వారు ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇవ్వడానికి వెళ్లారని పేర్కొన్నాయి. పలు అనివార్య కారణాలతోనే ఈడీ అధికారులు రాలేదని తెలిసింది. అధి కారులు ఇచ్చే సమాచారాన్ని విశ్లేషించేందుకు, ఆర్థిక లావాదేవీల్లోని లోపాలను గుర్తించేందు కు ఈడీ ఇప్పటికే ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్టు తెలిసింది. తగిన సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగి, క్షేత్రస్థాయిలో వివ రాలు సేకరించేందుకు ఈడీ అధికారులు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.
ఏసీబీ కూడా దూకుడుగా..
గొర్రెల పంపిణీ వ్యవహారంపై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. సు మారు రూ.700 కోట్ల మేర అవినీతి జరిగినట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కీలక నిందితులుగా భావిస్తున్న రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి ఓఎస్డీ కల్యాణ్ కుమార్‌లను మూడు రోజుల పాటు కస్టడీకి తీ సుకుని విచారించారు.
ప్రస్తుతం ఏసీబీ దర్యా ప్తు కీలక దశలో ఉంది. ఈ నేపథ్యంలో ఏసీబీ నుంచి అవసరమైన సమాచారాన్ని కోరాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. ఎంతమేర అవినీతి జరిగింది? సొమ్మును ఎవ రెవరి ఖాతాల్లోకి, ఎలా మళ్లించారు? ఏయే బ్యాంకు ఖాతాల్లోకి అక్రమంగా నిధులు మళ్లా యన్న వివరాలను తేల్చాలని యోచిస్తున్నట్టు సమాచారం. నగదు లావాదేవీలపై ఈడీ ము మ్మర దర్యాప్తు చేపడితే.. ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తాయోనన్న చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment