రాహుల్‌గాంధీని కలిసిన పోచంపల్లి చేనేత కార్మికులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: భారత్ జోడో యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో రాహుల్ గాంధీ నల్లగొండ సహా ఇతర జిల్లాల నుంచి వచ్చిన నేతన్నలు, గిరిజన రైతులతో భేటీ అయ్యారు. గంటకుపైగా వారితో చర్చించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ హయాంలో తమకు భూములు, పాస్ పుస్తకాలు ఇచ్చినా ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వం పోడు భూముల పేరుతో వాటిని లాక్కునే ప్రయత్నం చేస్తోందని... కొత్త పాస్‌పుస్తకాలు ఇవ్వకపోవడంతో రైతుబంధు, రైతు బీమా పథకాలు రావడంలేదని భువనగిరిలోని కడిలాబాయితండాకు చెందిన సుకునమ్మ రాహుల్ వద్ద గోడు వెళ్లబోసుకుంది.
వికారాబాద్ జిల్లా నారాయణపూర్ మండలానికి చెందిన మరో గిరిజన మహిళ రోజా సైతం ఇదే ఆవేదనను వ్యక్తం చేసింది. మరోవైపు కాంగ్రెస్ హయాంలో తమకు నూలు సబ్సిడీ వచ్చేదని.. ప్రస్తుతం ఆ వ్యవస్థ లేదని నేతన్నలు రాహుల్‌కు వివరించారు. అలాగే అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మికుల కుటుంబాలను ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని ‘ఆప్కో’నేత శ్రీభావరిషి రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన రాహుల్... చేనేతపై 5 శాతం జీఎస్టీని ఎత్తేయడంతోపాటు చేనేత ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే గిరిజనులకు భూహక్కులు కల్పిస్తామన్నారు. ఈ మేరకు ఈ వివరాలను కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వివరించారు. సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment