రాహుల్‌కు వలను బహూకరిస్తున్న టీపీసీసీ ఫిషర్‌మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: భారత్ జోడో యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పలు ప్రజాసంఘాలు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ శనివారం వేర్వేరుగా భేటీ అయ్యారు. చేనేత కుటుంబాల సమస్యలు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, విద్యావ్యవస్థ బలోపేతంపై స్పష్టతనిచ్చారు.
►ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నేటికీ పూర్తికాలేదని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ ఆధ్వర్యంలో కన్వీనర్ రాఘవాచారి తదితరులు రాహుల్ దృష్టికి తీసుకెళ్లగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి ప్రాధాన్యతగా ఈ పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
►రాష్ట్రంలో 60 వేల చేనేత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని సినీనటి పూనమ్ కౌర్, పద్మశ్రీ అవార్డుగ్రహీత అంజయ్య రాహుల్ కలసి వివరించగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు.
►కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు విద్యావిధానాన్ని ప్రోత్సహించడం వల్ల నిరుపేద కుటుంబాలు నష్టపోతున్నాయని రాహుల్‌తో భేటీలో గ్రాడ్యుయేట్లు, రీసెర్చ్ స్కాలర్లు పేర్కొనగా తాము గెలిస్తే ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసి నాణ్యమైన విద్య అందిస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పక్కాగా అమలు చేస్తామన్నారు.
►దివ్యాంగుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆధ్వర్యంలోని బృందం రాహుల్‌ను కలసి వినతిపత్రం ఇవ్వగా అధికారంలోకొస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లో ఘన స్వాగతానికి ఏర్పాట్లు
రాహుల్ భారత్ జోడో యాత్ర నవంబర్ ఒకటిన హైదరాబాద్‌కు చేరుకోనుండటంతో ఈ పాదయాత్రపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలతో విస్తరించి ఉన్న నగరంలో యాత్రను విజయవంతం చేయడం ద్వారా మూడు జిల్లాల్లో తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది.
ఇందుకోసం నగరం నలుమూలతోపాటు రాహుల్ పాదయాత్ర నిర్వహించే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తోంది. అలాగే యాత్రలో పాల్గొనేందుకు భారీ జనసమీకరణకు ప్రణాళిక రచిస్తోంది. దీనిపై మాజీ ఎంపీ, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ కనీవినీ ఎరుగని విధంగా హైదరాబాద్‌లో రాహుల్ పాదయాత్ర నిర్వహిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment