హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు బిల్డర్ల తంటాలు
హైదరాబాద్‌లో 5–6 నెలలుగా తగ్గిన స్థిరాస్తి కొనుగోళ్లు
భవనాలను హైడ్రా కూల్చేస్తుందేమోనని వినియోగదారుల్లో పెరిగిన భయాలు.. దీంతో తమ ప్రాజెక్టులకు హైడ్రా ఆమోదం ఉందంటూ కస్టమర్లకు డెవలపర్ల ఫోన్లు
నిర్మాణాలకు భద్రత ఉందంటూ ముందస్తు ఒప్పందాలు
ప్రీ–ఈఎంఐలు, ఉచిత రిజిస్ట్రేషన్లు, లక్కీ డ్రాలతో ఆకర్షించే ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్: రండి బాబూ రండి.. భాగ్యనగరంలో హైడ్రా ఆమోదించిన మా వెంచర్/ప్రాజెక్టులో దయచేసి ఇళ్లు కొనుగోలు చేయండి’. ఇదీ ఇప్పుడు రాజధాని హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాల కోసం బిల్డర్లు/డెవలపర్లు చేస్తున్న జపం. నగరంలో ఓఆర్‌ఆర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’.. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో కట్టిన అక్రమ నిర్మాణాలను ఇటీవల కూల్చేయడం నగర రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
హైడ్రా భయంతో నగరంలో ఇళ్లు కొనాలంటేనే గృహ కొనుగోలుదారులు భయపడిపోతున్నారు. ఆయా ప్రాజెక్టులకు నిర్మాణ అనుమతులతోపాటు వాటికి గృహ రుణాలు లభించే అర్హతలన్నీ ఉన్నప్పటికీ ధైర్యం చేయలేకపోతున్నారు. హైడ్రా ఎప్పుడు ఏ భవనాన్ని కూల్చేస్తుందోనని భయపడుతూ ప్రాపర్టీల కొనుగోళ్లకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో గత ఐదారు నెలలుగా గ్రేటర్ హైదరాబాద్‌లో గృహ కొనుగోళ్లతోపాటు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా తగ్గింది.
10 శాతం డౌన్ పేమెంట్ కట్టిన కొందరు వినియోగదారులు ఏకంగా డెవలపర్లతో ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నారు. మరికొందరైతే గృహ కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కస్టమర్లును ఆకర్షించడం రియల్టర్లకు సవాల్‌గా మారింది. భవిష్యత్తులో నిర్మాణాలకు ఎలాంటి ఢోకా ఉండదని కొందరు డెవలపర్లు కస్టమర్లతో ముందస్తు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు.
ఆఫర్లతో కస్టమర్లకు వల..
సాధారణంగా దసరా, దీపావళి పండుగల్లో గృహ కొనుగోళ్లు జోరుగా సాగుతుంటాయి. కానీ ఈసారి ఆశించినంత వ్యాపారం లేదని డెవలపర్లు వాపోతున్నారు. దీంతో కొందరు బిల్డర్లు ప్రత్యేకంగా టెలికాలర్లను నియమించుకొని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మించే తమ ప్రాజెక్టులు/వెంచర్లకు ‘హైడ్రా అప్రూవల్’ ఉందంటూ కస్టమర్లకు ఫోన్లు చేసి వివరిస్తున్నారు.
ప్రీ–ఈఎంఐ, రిజిస్ట్రేషన్ చార్జీలు, ఉచిత కారు, విదేశీ ప్రయాణాలు వంటి రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదాయంతో సంబంధం లేకుండా 90 శాతం వరకూ బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని కూడా చెబుతున్నారు.
ఫోర్త్ సిటీలో జోరుగా..
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించడంతో ఆయా ప్రాంతాల పరిధిలో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
మరోవైపు ముచ్చర్లలో ఫోర్త్ సిటీ రానున్న నేపథ్యంలో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. ఇప్పుడు స్థలాలు కొని పెట్టుకుంటే భవిష్యత్తులో రేట్లు అమాంతం పెరుగుతాయని రియల్టర్లు చెబుతున్నారు. సీఎం ప్రకటనలతో కూడిన కరపత్రాలను కస్టమర్లకు వాట్సాప్ ద్వారా పంపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment