పెరుగుతున్న ప్రాణహిత వరద ఉధృతి
వాహనాలు, మెటీరియల్ తరలింపు
కాళేశ్వరం: జయ«శంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలో 7వ బ్లాక్ చుట్టూ వేసిన రింగ్‌బండ్‌ను తొలగిస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి నేపథ్యంలో గురువారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గతేడాది అక్టోబర్ 21న బ్యారేజీ 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పియర్లు పగుళ్లు తేలి వంతెనతో పాటు కుంగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‌డీఎస్‌ఏ సూచన మేరకు గ్రౌటింగ్, ఇసుక తొలగింపు, షీట్‌ఫైల్స్ అమరిక తదితర మరమ్మతులకు వీలుగా, 7వ బ్లాక్‌లోకి వరద చేరకుండా దానిచుట్టూ రింగ్‌బండ్ నిర్మించారు.
అయితే వారం రోజులుగా ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండడంతో బ్యారేజీకి ప్రాణహిత వరద తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రింగ్‌బండ్‌ను తొలగించాలనే నిర్ణయానికొచ్చారు. రింగ్‌బండ్‌ను పొక్లెయినర్లతో తవ్వించి టిప్పర్ల ద్వారా మెటీరియల్‌ను బయటకు తరలిస్తున్నారు. వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుండడంతో గోదావరిలో ఉన్న రోడ్లను సైతం తొలగిస్తున్నారు. నిర్మాణ సంస్థకు సంబంధించిన వాహనాలు, మెటీరియల్‌ను పైకి తీసుకువెళ్తున్నారు.
ప్రస్తుతం మేడిగడ్డ వద్ద ప్రాణహిత ద్వారా 16 వేలకు పైగా క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ విషయమై ఇంజనీరింగ్ అధికారులను వివరణ అడగ్గా..మళ్లీ కుంగిందని, బొరియలు ఏర్పడ్డాయనే వదంతులు వచ్చాయని, కానీ అలాంటిదేమీ లేదని చెప్పారు. వర్షాలతో వరద నీరు రావడం వల్లే రింగ్‌బండ్ తొలగింపు పనులు చేపడుతున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment