
మంత్రి శ్రీధర్ సమక్షంలో ఒప్పంద పత్రాలు అందజేస్తున్న రెన్యూసిస్ సంస్థ ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్/మహేశ్వరం: సోలార్ ఫొటో వోల్టాయిక్ మాడ్యూల్, ఫొటో వోల్టాయిక్ సెల్స్ తయారీలో అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థ ‘రెన్యూసిస్’తెలంగాణలో రూ.6 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వంతో రెన్యూసిస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఫ్యాబ్‌సిటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో రెన్యూసిస్‌తో జరిగిన ఒప్పందంపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సంతకాలు చేశారు.
ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలో తయారీ యూనిట్లు కలిగిన రెన్యూసిస్ తమ అతిపెద్ద తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు ముందుకు రావడంపై మంత్రి శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను తమ ప్రభుత్వం అందజేస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా హైదరాబాద్ సోలార్ పరికరాల తయారీకి హబ్‌గా మారుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీని ప్రోత్సహిస్తుందన్నారు.
సోలార్ పరికరాల ఉత్పత్తి రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తామని, అందుకు అనువుగా ఉండే సమగ్ర ఇంధన విధానాన్ని రూపొందిస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. పరిశ్రమలకు ప్రోత్సాహం : రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని హార్డ్‌వేర్ పార్కు–2లో అపోలో మైక్రో సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ ఎల్రక్టానిక్ పరికరాల కంపెనీ నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడుల సేకరణకు అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రం ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్షరింగ్ హబ్‌గా మారిందన్నారు. ఏరోస్పేస్ పరికరాల తయారీలో దేశంలోనే ముందు వరుసలో ఉన్నామని స్పష్టం చేశారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, అపోలో మైక్రో సిస్టమ్స్ కంపెనీ ఎండీ బద్దం కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment