కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 41 నుంచి 50 శాతానికి పెంచాలి
పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించే కుట్ర: భట్టి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర అధికారాలను పరిమితం చేయకపోవడం వల్ల రాష్ట్రాల అభివృద్ధికి తగినన్ని నిధులు లేకుండా పోయాయని, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతం నుంచి 50శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో గురువారం తిరువనంతపురం లో జరిగిన ‘కేరళ కాంక్లేవ్’కు భట్టి హాజరయ్యారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో భట్టి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలను, దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కేంద్రం, రాష్ట్రం దేనికదే బలంగా ఉంటూ తమ విధులు నెరవేర్చడానికి అవసరమైన వనరులతో కూడిన వ్యవస్థను రాజ్యాంగ నిర్మాతలు రూపొందించారని, కానీ కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా రాష్ట్రాలతో వ్యవహరిస్తోందని విమర్శించారు.
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ 14వ ఆర్థిక సంఘం చేసిన నిర్ణయం తప్పుదోవ పట్టించేదేనని మండిపడ్డారు. సెస్సులు, సబ్ చార్జీల ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలతో పంచుకోవడం లేదన్నారు. వాటిపై ఆధారపడటం వల్ల కేంద్రం స్థూల పన్ను ఆదాయం 28 శాతానికి పెరిగిందని, దీంతో రాష్ట్రాల వనరుల్లో గణనీయంగా కోత పడిందని చెప్పారు. జీఎస్‌టీలో అవలంబిస్తున్న విధానం వల్ల రాష్ట్రాల ఆర్థిక స్థితి దెబ్బతింటోందన్నారు.
దేశ జనాభాలో 19.6 శాతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు జీడీపీలో 30 శాతంతో గణనీయమైన సహకారం అందిస్తున్నప్పటికీ, ఫైనాన్స్ కమిషన్ పన్నుల పంపిణీలో వాటాను 21.073 శాతం నుంచి 15.800 శాతానికి తగ్గించారన్నారు. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాల కఠినమైన నిబంధనలు, మ్యాచింగ్ గ్రాంట్ షరతులు రాష్ట్ర బడ్జెట్లను ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు.
దక్షిణాది స్వరాన్ని అణగదొక్కే కుట్ర
రాబోయే నియోజకవర్గాల పునరి్వభజన కసరత్తు 2011 జనాభా ఆధారంగా జరిపితే లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతుందని భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ నిర్ణయాధికారంలో దక్షిణాది రాజకీయ స్వరాన్ని అణగదొక్కే కుట్ర చేస్తున్నారన్నారు.
జనాభా నియంత్రణ, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్రాలు అన్యాయానికి గుర య్యే అవకాశం ఉందని, అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు అసమాన ప్రాతినిధ్యాన్ని పొందే అవకాశం ఉందని చెప్పారు. ఒక శతాబ్దంలో ప్రతినిధుల సభలో సభ్యుల సంఖ్య గరిష్టంగా 435గా ఉండాలని నిర్ణయించిన అమెరికా విధానాన్ని మనం అనుసరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment