సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేతన బకాయిలపై సింగరేణి సంస్థ మంగళవారం కీలక ప్రకటన చేసింది. సింగరేణిలో జాతీయ బొగ్గు గనుల వేతన ఒప్పందం అమలు అవుతున్న విషయం తెలిసిందే. పదో వేజ్‌బోర్డు కాలపరిమితి 2021 జూలై 1తో ముగిసింది. అప్పటి నుంచి 11వ బోర్డు అమల్లోకి వచ్చింది.
ఈ మేరకు 2021 జూలై నుంచి 2023 మే 31 వరకు మొత్తం 22 నెలలకు సంబంధించి ఉద్యోగులు, కార్మికులకు పెరిగిన వేతన బకా యిలు చెల్లించాల్సి ఉంది. దీనిపై కార్మిక సంఘాలు క్రమం తప్పకుండా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలో 11వ వేజ్‌బోర్డు వేతన బకాయిలు ఈనెల 21న చెల్లిస్తామని సింగరేణి ప్రకటించింది. ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో పని చేస్తున్న 42 వేల మందికి పైగా ఉన్న ఉద్యోగులు, కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ బకాయిల మొత్తం జమచేస్తారు. ఇందుకు సంస్థ రూ.1,720 కోట్లు కేటాయించింది.
కనిష్టంగా రూ.2.60 లక్షలు
సింగరేణిలో ప్రారంభ వేతనం పదో వేజ్‌బో ర్డులో రూ. 25,000 ఉండగా 11వ వేజ్‌బోర్డ్‌లో ఇది రూ. 37,000కు చేరుకుంది. సీనియర్ విభాగంలో గరిష్ట వేతనం రూ.76వేల నుంచి రూ.90 వేలకు పైగా చేరుకుంది. దీంతో ఒక్కో కార్మికుడు పొందే వేతనాల బకాయిల మొత్తం కనిష్టంగా రూ. 2.64 లక్షలు ఉండగా, గరిష్టంగా రూ.3.08 లక్షల వరకు ఉంటుంది. ఇక ఉద్యోగుల విషయంలో గరిష్టంగా రూ.6 లక్షల వరకు వేతన బకాయిలు అందనున్నాయి.
చదవండి: జమిలీ ఎన్నికలపై గుత్తా సుఖేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment